రాజకీయాల్లో సమీకరణాలు చాలా వేగంగా మారుతుంటాయి.  నిన్నటి వరకు ప్రాణ సన్నిహితులుగా ఉండే నాయకులు తర్వాతి రోజు బద్ధ శత్రువులుగా మారుతుంటారు. అలాగే రాజకీయాల్లో శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఎవరూ ఉండరు అనే నానుడి ఉంది.  దీనిని నిజం చేసేలా ప్రస్తుతం విజయ సాయి రెడ్డి వ్యవహారం ఉంది.  ఇక మీదట రాజకీయాలు వదిలేస్తున్నానని.. వ్యవసాయం చేసుకుంటా అని చెప్పిన విజయ సాయి రెడ్డి ఇప్పుడు సంచలన మాటలతో జగన్ ను వైసీపీ నేతలను ఇరుకున పెడుతున్నారు. 


ఇటీవల సీఐడీ విచారణకు వచ్చిన విజయసాయిరెడ్డి వైసీపీలో కోటరీ పెరిగిపోయిందని, అధినేత జగన్ చుట్టూ చేరిన కోటరీ వల్లే తాను వైసీపీతో తెగతెంపులు చేసుకోవాల్సి వచ్చిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వంలో జరిగిన స్కాంలపైనా కొన్ని లీకులిచ్చారు.  కాకినాడ సీపోర్ట్సు వాటాల బదిలీలో తన పాత్ర లేదంటూనే కర్త, కర్మ, క్రియ అంతా జగన్ తమ్ముడు విక్రాంత్ రెడ్డేనంటూ బాంబు పేల్చారు.  


ఇక అంతటితో ఆగకుండా రాష్ట్రంలో చర్చనీయాంశమైన లిక్కర్ స్కాం సూత్రధారి, పాత్రధారి కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి అంటూ మరో లీకు ఇచ్చారు.  ఈ రెండు విషయాలే వైసీపీని కుదిపేస్తుండగా, తాజాగా సాయిరెడ్డి చేసిన ట్వీట్ మరింత అగ్గి రాజేస్తోంది.  రాజు ప్రజల్లోకి వెళ్లకపోతే.. కోటరీ, కోట ఏదీ మిగలదు అంటూ తాజాగా విజయసాయిరెడ్డి ట్వీట్ చేశారు.  జగన్ తన బంగ్లా దాటి రాకుండా కోటరీ చెప్పిన మాటలు వింటే తాడేపల్లి ప్యాలెస్ కే పరిమితం అయిపోవాల్సి వుంటుందనే ఉద్దేశంతో విజయసాయిరెడ్డి ఆ ట్వీట్ చేశారంటున్నారు. వైసీపీతో తెగతెంపులు చేసుకున్నానని చెబుతూనే వైసీపీపై ఆయన కామెంట్స్ చేస్తుండటం చర్చనీయాంశమవుతోంది.


ప్రశాంత జీవితం గడుపుతానని చెబుతున్న విజయసాయిరెడ్డి వైసీపీలో కల్లోలం రేపేలా ట్వీట్లు, ప్రకటనలు చేయడం హాట్ టాపిక్ గా మారింది.  విజయ సాయి రెడ్డి వ్యవహారంపై వైసీపీ ధీటుగానే స్పందిస్తోంది. జగన్ రెండోసారి అధికారంలోకి వస్తే విజయసాయిరెడ్డి ఇలా రాజీనామా చేసేవారా? అంటూ వైసీపీ ప్రశ్నిస్తోంది. మరి ఇది ఎక్కడి వరకు దారి తీస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: