
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆకాశమే హద్దుగా.. అమరావతి పరుగులు పెడుతోంది. జెడ్ స్పీడ్ లో ఏపీ కేపిటల్ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. రాజధాని నిర్మాణానికి సుమారు రూ.64 వేల కోట్లు నిధులు అవసరం ఉండగా.. ప్రభుత్వం ఆ మేరకు నిధుల వేట కొనసాగిస్తోంది. ఇప్పటికే వీలైనన్ని మార్గాల ద్వారా నిధులు సేకరించి వడివడిగా పనులు చేపట్టింది చంద్రబాబు ప్రభుత్వం. ఇప్పటికే కేంద్రప్రభుత్వంతో పాటు పలు బ్యాంక్‌లు, సంస్థల నుంచి రుణాలు తీసుకొస్తోంది.
ప్రపంచ బ్యాంకు ద్వారా రూ.15 వేల కోట్లకు రుణ ప్రణాళిక విడుదలైన విషయం తెలిసిందే. తాజాగా మరో పెద్ద మైలురాయిని ప్రభుత్వం చేరుకుంది. అమరావతి నిర్మాణం కోసం హడ్కో రూ.11 వేల కోట్లు ఇచ్చేందుకు ఒప్పందం కుదుర్చుకుంది. ఉండవల్లిని సీఎం నివాసంలో ఈ మేరకు సీఆర్డీఏతో హడ్కో ఒప్పందం చేసుకుంది. దీంతో త్వరలోనే అమరావతికి 11వేల కోట్ల సాయం అందనుంది. ఈ నిధులను అమరావతిలో పలు కీలక పనులకు ఉపయోగించబోతోంది ఏపీ ప్రభుత్వం.
అమరావతి రాజధాని నిర్మాణం కోసం.. హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్‌కు గతంలోనే ప్రభుత్వం ప్రతిపాదనలు పంపింది. ఈ ఏడాది జనవరి 22న ముంబైలో జరిగిన హడ్కో బోర్డు సమావేశంలో నిధులు మంజూరుకు హడ్కో అంగీకారం తెలిపింది. నిధుల విడుదలకు సీఎం చంద్రబాబు సమక్షంలో మంత్రి నారాయణ, మున్సిపల్ అధికారులతో హడ్కో ఈ ఒప్పందం కుదిరింది. అమరావతిని వేగంగా అభివద్ధి చేసి.. తద్వారా సంపదను సృష్టించి.. రుణాల్ని తిరిగి చెల్లించడమే కాకుండా రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలనే లక్ష్యంతో చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది.
ఇందులో భాగంగా గతంలో పలు సంస్థలకు కేటాయించిన భూముల విషయంలో ఇటీవలే ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 30వేల కోట్ల విలువైన పనులకు టెండర్లు కూడా పూర్తయ్యాయి. ఇక హడ్కో అందజేస్తున్న ఈ రుణాన్ని వాయిదాల రూపంలో తిరిగి చెల్లించేలా ప్రభుత్వం ఒప్పందం చేసుకుందని చెబుతున్నారు.