
తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ పరిస్థితి ఎలా ఉన్నా.. ఏపీ పరిస్థితి మాత్రం రాజకీయంగా కాస్త భిన్నంగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన దగ్గర నుంచి అక్కడ అధికారం చేతులు మారుతూనే ఉంది. ఇదే క్రమంలో పవర్ కోల్పోయిన వారు చెప్పే మాటలు మాత్రం మారడం లేదు. గతంలో 2019లో దారుణంగా 23 స్థానాలకే పరిమితం కాగా.. 2025లో వైసీపీ మరింతగా 11 స్థానాలనే దక్కించుకుంది.
ఇక ఇరు పార్టీల అధినేతలు ఓటమికి ఒకే రకమైన కారణాలు చెప్పారు. ఇంత మంచి చేసినా ఎందుకు ఓడామో అర్థం కావడం లేదని ప్రెస్ మీట్లు పెట్టి మరీ చెప్పారు. అయితే 2019లో టీడీపీ ఓటమికి కారణాలు చెప్పలేకపోయిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం అసెంబ్లీ సాక్షిగా చెప్పారు.
2019లో ఎందుకు ఓటమి పాలు అయ్యామో చంద్రబాబు నిండు సభలో చెప్పుకొచ్చారు. అంతే కాదు 2004లో తొలిసారి ఓటమి ఎలా ఎదురైందో ఆ ముచ్చట కూడా చెప్పారు. అసెంబ్లీలో బాబు టీడీపీ ఓటమికి ఎవరో కారణం కాదు తానే అని సంచలన స్టేట్మెంట్ ఇచ్చేశారు. తనను ఎవరూ ఓడించలేదని ఆయన చెబుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆ ఓటముల వెనక తానే ఉన్నాను అని చెప్పుకొచ్చారు.
తాను అధికారంలో ఉన్నపుడు కొన్ని పనులు చేయలేకపోవడం వల్లనే ఓటమి పాలు అయ్యాను అని అన్నారు. అంతే కాదు ప్రభుత్వ పనులలో పడి పార్టీని అలాగే ఎమ్మెల్యేలను కో ఆర్డినేట్ చేసుకోలేమపోయామని కూడా అంగీకరించారు. అలా టీడీపీ ఓటమికి తాను కారణం అని బాబు ఒప్పుకున్నారు. ఏ ప్రభుత్వం అయినా ప్రజా సమస్యలకు శాశ్వతంగా పరిష్కారం చూపిస్తే ఓటమి అన్నదే ఉండదని ఆయన చెబుతూ కూటమి ఎమ్మెల్యేలను ఆ దిశగా దిశా నిర్దేశం చేశారు. మరి 2019 పాఠాలు నేర్చి వాటిని 2029లో రిపీట్ చేయకుండా ఉంటారో లేదో అనేది భవిష్యత్తు ఎన్నికల్లోనే తెలుస్తుంది.