
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ షాక్ ల పరంపర కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు పక్క దేశాలు, తమకు వ్యతిరేకంగా ఉండే వారిపై చర్యలు తీసుకున్న ట్రంప్.. ఇప్పుడు మాజీ అధ్యక్షుడు జో బైడెన్ పై పడ్డారు. ఈ ఏడాది జనవరిలో ట్రంప్ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు అధ్యక్ష హోదాలో ఉన్న బైడెన్ బాధ్యతల నుంచి వైదొలగకముందు, తన పదవీకాలం ముగిసేలోపు పలు సంచలన నిర్ణయాలు తీసుకున్న సంగతి తెలిసిందే.
తన కుమారుడు హంటర్ బైడెన్ పై అక్రమ ఆయుధం కొనుగోలు సహా రెండు క్రిమినల్ కేసులు ఉండగా.. వాటిలో క్షమాభిక్ష ప్రసాదించాడు. ఆ నిర్ణయం నాడు తీవ్ర సంచలనంగా మారింది. ఇదే సమయంలో సుమారు 1,500 మంది ఖైదీలకు శిక్ష తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇలా ఒకే రోజు ఈ స్థాయిలో క్షమాభిక్షలు కల్పించడం అమెరికా ఆధునిక చరిత్రలో ఇదే మొదటిసారి అనే చర్చ నాడు బలంగా నడిచింది. వీటిని ట్రంప్ ఆనాడే వ్యతిరేకించారు.
ఇక తాజాగా బాధ్యతలు తీసుకున్న తర్వాత బైడెన్ క్షమాబిక్షలపై ట్రంప్ షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. గత అధ్యక్షుడు వీటికి సంబంధించిన ఆదేశాలపై ఆటోపెన్ తో సంతకాలు చేశారని.. వాటిని ఆయనకు తెల్లియకుండానే అమలుచేశారని అన్నారు. నిద్రమత్తులో రాజకీయ దుండగులు చాలామందికి బైడెన్ క్షమాభిక్షలు ప్రసాదించారని.. అవి చెల్లనివని, శూన్యమని, అవి ఎలాంటి ప్రభావం చూపవని తాను ఇప్పుడు ప్రకటిస్తున్నట్లు ట్రంప్ తెలిపారు. ఎందుకంటే.. అవి ఆటోపెన్ తో చేసినవని.. ఒక్కమాటలో చెప్పాలంటే.. బైడెన్ వాటిపై సంతకం చేయలేదని అన్నారు.
అసలు ఈ విషయం కూడా బైడెన్ కు తెలియదని.. ఈ వ్యవహారం నడిపినవారు నేరం చేశారని.. వారు అత్యున్నతస్థాయి దర్యాప్తును ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని అర్థం చేసుకోవాలని ట్రంప్ సోషల్ మీడియా పోస్టులో హెచ్చరించారు. దీంతో ఈ విషయం ఇప్పుడు వైరల్ గా మారింది. బైడెన్ కుమారుడి పరిస్థితి ఇప్పుడు ఏమిటనేది ఆసక్తిగా మారింది!