
జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాన్ని పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అట్టహాసం గా నిర్వహించారు. లక్షలాది మంది హాజరైన ఈ సభలో పవన్ దేశంలో ఉన్న అనేక బర్నింగ్ టాపిక్స్ పై తన గళం వినిపించాడు. భాషల వ్యవహారంపై కూడా స్పందించాడు. ‘భాషలను ద్వేషించడం బాధాకరం. హిందీ ని అంత ద్వేషించేవాళ్ళు, తమిళ సినిమాలను ఎందుకు హిందీ లో డబ్ చేసి డబ్బులు పోగు చేసుకుంటున్నారు?..మీకు వ్యాపారాల కోసం మాత్రం హిందీ కావాలి, చదువుకోవడానికి మాత్రం వద్దు’ అంటూ వ్యాఖ్యానించాడు.
దీనిపై సోషల్ మీడియా లో రెండు రోజులుగా విభిన్నమైన అభిప్రాయాలూ వ్యక్తం అవుతున్నాయి. దీనిపై అసెంబ్లీ సమావేశాల్లో సీఎం చంద్రబాబు స్పందిచారు. ‘భాషలపై ద్వేషం తగదు. హిందీ మన జాతీయ భాష. మన మాతృ భాషను నేర్చుకుంటూనే హిందీ భాషను కూడా నేర్చుకోవాలి. కేవలం హిందీ ఒక్కటే కాదు, ప్రపంచంలో ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషలు నేర్చుకోవాలి. అప్పుడే మనం ఎక్కడికి వెళ్లినా బ్రతకగలం, ఇప్పుడు నేను ఢిల్లీ కి వెళ్తే అనర్గళంగా హిందీ మాట్లాడే పరిస్థితి ఉంది. అలాంటి పరిస్థితి అందరికీ రావాలి’ అంటూ వ్యాఖ్యానించారు.
దీనిని ఓ రాజకీయ అంశంగా చేసి వివాదాలు సృష్టించకుండా ఎన్ని భాషలు వీలైతే అన్ని నేర్చుకోవాలని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. జీవనోపాధి కోసం మనం ఎన్ని భాషలైన నేర్చుకుంటాం. మనం మాతృభాషను మర్చిపోం. భాష వల్ల కమ్యూనికేషన్ సులభమవుతుంది. ఎక్కువ భాషలు నేర్చుకోవడం ఉత్తమం అని చంద్రబాబు అన్నారు. తమిళనాడు లో భాష భావాన్ని కేవలం రాజకీయం కోసమే ఉపయోగించుకుంటున్నారు, కానీ మన రాష్ట్రంలో అలాంటిదేమి లేదు, పవన్ కళ్యాణ్ గారు అనవసరంగా ఆ టాపిక్ లోకి వెళ్లి ట్రోల్ అవుతున్నారు అంటూ చెప్పుకొచ్చారు.
మరి ఎన్డీయే కూటమిలో కొనసాగుతున్న చంద్రబాబు నాయుడు తమిళనాడు సీఎం స్టాలిన్ కేంద్రంపై చేస్తోన్న ఆరోపణలకు సమాధానంగానే ఈ వ్యాఖ్యలు చేశారా అనే అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.