
ఏపీలో కూటమి ప్రభుత్వం పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. సరికొత్త ఆలోచనలు చేస్తూ షాక్ ఇస్తోంది. సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు ఇటు అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. ఢిల్లీ పర్యటన సందర్భంగా చంద్రబాబు బిల్‌గేట్స్‌తో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు ఈ భేటీ కొనసాగింది. ఏపీలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాలను వివరించారు. అభివృద్ధి, సంక్షేమం కోసం గేట్స్ ఫౌండేషన్ సేవలను ఎలా వినియోగించుకోవాలనే విషయంపై మాట్లాడారు.
ఏపీలో కూటమి సర్కారు ప్రభుత్వానికి సంబంధించి ప్రభుత్వంలో కొత్తగా నలుగురు సలహాదారులు నియమితులు కావడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే గత వైసీపీ మాదిరిగా ఎలాంటి విమర్శలకు తావు లేకుండా ఎంపిక పట్ల సీఎం చంద్రబాబు జాగ్రత్తలు వ్యవహరించారు. ఎంపికైన వారంతా ఉన్నత రంగానికి చెందిన వారు కావడం గమనార్హం.
ఇస్రో మాజీ ఛైర్మన్, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ ప్రొఫెసర్ శ్రీధర ఫణిక్కర్ సోమ్‌నాథ్, పద్మభూషణ్ అవార్డు గ్రహీత, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర ఎల్లా, డీఆర్‌డీఓ మాజీ ఛీఫ్, రక్షణ మంత్రిత్వ శాఖ సలహాదారు జీ సతీష్ రెడ్డి, ఏపీ ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ మాజీ డైరెక్టర్ కేపీసీ గాంధీ.. ఈ జాబితాలో ఉన్నారు.
ఫోరెన్సిక్ సైన్స్ సలహాదారుగా కేపీసీ గాంధీ, ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్- జీ సతీష్ రెడ్డి, స్పేస్ టెక్నాలజీ- ఎస్ సోమనాథ్, చేనేత, హస్త కళల అభివృద్ధి శాఖ సలహాదారుగా సుచిత్ర ఎల్లా అపాయింట్ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే విజయానంద్ ఉత్తర్వులు జారీ చేశారు.
వ్యవసాయం, విపత్తు నిర్వహణ, పట్టణ ప్రణాళిక, వాతావరణ మార్పు రంగాల్లో ఏపీ ప్రభుత్వం ఎస్ సోమ్‌నాథ్, డీప్ టెక్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, రోబొటిక్స్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో జీ సతీష్ రెడ్డి, ఫోరెన్సిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, డీఎన్ఏ సీక్వెన్సింగ్.. వంటి రంగాల్లో ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవడంపై కేపీసీ గాంధీ నుంచి సలహాలను స్వీకరిస్తుంది. వారి సేవలను వినియోగించుకుంటుంది.