
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డిని కలిసేందుకు ఆయన నివాసం వద్దకు గుమ్మడి నర్సయ్య వచ్చారు. అయితే అపాయిట్ మెంట్ లేదని భద్రతా సిబ్బంది ఆయన్ను లోనికి పంపించలేదు. దీతో నర్సయ్య సీఎం కాన్వాయ్ కోసం రోడ్డు పక్కన నిల్చున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కమ్యూనిస్టు పార్టీ నుంచి ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నర్సయ్యను సీఎం రేవంత్ అనుమానించారని ప్రతిపక్షాల నుంచి విమర్శలు వచ్చాయి.
ఈ అంశంపై సీఎం రేవంత్ అసెంబ్లీలో రెండ్రోజుల క్రితం స్పందించారు. గుమ్మడి నర్సయ్య వచ్చిన విషయం తనకు ఆ సమయంలో తెలియదని.. తెలిసన వెంటనే తన కార్యాలయ సిబ్బందితో నర్సయ్యకు ఫోన్ చేయించినట్లు చెప్పారు. అయితే అప్పటికే ఆయన ఊరు వెళ్లినట్లు చెప్పారన్నారు. మళ్లీ వచ్చిన తర్వాత కలుస్తానని నర్సయ్య తన ఆఫీసు అధికారులకు చెప్పినట్లు వివరించారు.
ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య తాజా, మాజీ సీఎంలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మాజీ సీఎం కేసీఆర్ అన్నీ నేనే అనే పద్ధతిలో, ఒక నియంతలా వ్యవహరించారని ఆరోపించారు. ఆయన మంత్రులను, ఎమ్మెల్యేలను, పార్టీ నేతలను ఎవ్వరినీ దగ్గరకు కూడా రానివ్వడని తెలిపారు. ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి జనాలతో మమేకం అవుతున్నారని, రేవంత్ ప్రజల మనిషి అంటూ కొనియాడారు.
తమ జిల్లాకు చెందిన పలు సమస్యలను ఆయనకు వివరించేందుకు తగిన సమయం ఇచ్చారని హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్ రాష్ట్రాన్ని అప్పులకుప్పగా మార్చారని.. వందల ఎకరాలు ఉన్నవారికి కూడా రైతుబంధు ఇచ్చారని, లక్ష రూపాయల రుణమాఫీ చేస్తామని ఏళ్లు గడిపారని ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతుబంధు పదుల ఎకరాలు ఉన్నవాళ్లకు ఇవ్వకుండా ఆపేశారని.. ఆది మంచి నిర్ణయం అని, పేద ప్రజలకు మాత్రమే సంక్షేమ పథకాలు అందించడం మంచి విషయం అని గుమ్మడి నర్సయ్య తెలియజేశారు.