
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూసుకుపోతున్నారు. వైట్‌హౌస్‌లో అడుగు పెట్టిన దగ్గర నుంచి ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి పెట్టారు. తాను అనుకున్నది అమలు చేస్తూ ముందుకు సాగుతున్నారు. తాను అధికారంలో ఉంటే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వచ్చేది కాదని.. చర్చల ద్వారా పరిష్కరిస్తానని చెప్పారు.
అధ్యక్షుడిగా ఎన్నికైతే యుద్ధాలు ఆపేందుకు ప్రయత్నిస్తానని చెప్పారు. అన్నట్లు గానే రష్యా, ఉక్రెయిన్, అటు ఇజ్రాయెల్‌తో చర్చలు జరిపారు. ఇజ్రాయెల్, హమాస్ మధ్య 30 రోజుల కాల్పుల విరమణ ఒప్పందం చేయించారు. తాజాగా ఇప్పుడు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం పూర్తిగా ఆపే ప్రయత్నంలో సక్సెస్ అయినట్లు కనిపిస్తోంది. వాషింగ్టన్ నుంచి వెలువడిన వార్తల ప్రకారం, ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధాన్ని శాంతియుతంగా ముగించేందుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అంగీకరించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌తో సుమారు రెండు గంటల ఫోన్ సంభాషణ తర్వాత ఈ నిర్ణయం తీసుకున్నట్లు వైట్ హౌస్ తెలిపింది. ఈ సందర్భంగా ఇరు నేతలు శాశ్వత శాంతి స్థాపనతో యుద్ధానికి ముగింపు పలకాలని సంకల్పించారు. అమెరికా, రష్యా మధ్య సంబంధాలు మెరుగుపడాలని, ద్వైపాక్షిక సహకారం అవసరమని వారు ఒకరికొకరు వ్యక్తం చేశారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం రెండు దేశాలకు తీవ్ర నష్టాలు మిగిల్చింది. అనేక ప్రాణాలు కోల్పోవడంతో పాటు భారీ నిధులు ఖర్చయ్యాయి. ఈ నిధులను ప్రజా సంక్షేమానికి ఉపయోగిస్తే ఎంతో అభివృద్ధి సాధ్యమయ్యేదని వైట్‌హౌస్ అభిప్రాయపడింది. భవిష్యత్తులో ఇలాంటి వివాదాలు తలెత్తకుండా సామరస్యపూర్వక పరిష్కారాలతో ఈ యుద్ధాన్ని ఇప్పుడే ముగించాలని పేర్కొంది. యుద్ధ విరమణకు తీసుకోవాల్సిన చర్యలపై ట్రంప్, పుతిన్ చర్చించారు. ముఖ్యంగా ఇంధన వనరులు, మౌలిక సదుపాయాలపై దాడులను ఆపడం, నల్ల సముద్రంలో కాల్పులను నియంత్రించడం వంటి అంశాలపై తక్షణ చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. సాంకేతిక సమస్యలను చర్చల ద్వారా పరిష్కరించాలని ట్రంప్ సూచించారు.
శాంతి ప్రక్రియకు పుతిన్ ఒక షరతు విధించారు. ఉక్రెయిన్‌కు విదేశీ సైనిక సాయం, నిఘా సమాచారం అందించడాన్ని పూర్తిగా నిలిపివేయాలని క్రెమ్లిన్ పేర్కొంది. ఈ షరతు ద్వారా వివాదం మరింత తీవ్రతరం కాకుండా రాజకీయ, దౌత్య మార్గాల్లో పరిష్కారం కోసం కృషి చేయాలని సూచించింది. ట్రంప్ ఈ శాంతి కృషిని స్వాగతించినట్లు క్రెమ్లిన్ అభినందించింది.