
తమ పార్టీ గుర్తుపై గెలిచి పార్టీ ఫిరాయించిన వారిపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పార్టీ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఉప ఎన్నికలు ఖాయమని గులాబీ అధినేత కేసీఆర్, కేటీఆర్ లు పదే పదే అంటున్నారు. సుప్రీంకోర్టులో బిఆర్ఎస్ దాఖలు చేసిన పిటిషన్లను విచారించిన సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. ఈనెల 25వ తేదిలోపు పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేలు, స్పీకర్ కార్యాలయంతోపాటు శాసనసభ కార్యదర్మితో సహా వివరణ ఇవ్వాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
స్పీకర్ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవడంతో నిర్లక్ష్యం వ్యవహరించడం సరికాదంటూ కీలక వ్యాఖ్యలు చేసింది. ఇప్పుడు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు మరో ప్లాన్ వేశారు. అదేమిటంటే తాము పార్టీ ఫిరాయించలేదని మర్యాదపూర్వకంగా సీఎంను కలిస్తే పార్టీ ఫిరాయించినట్లుగా మీడియాలో రాశానని వాదిస్తున్నారు.
అలా మేము రేవంత్ రెడ్డిని కలవగానే, ఇలా మీడియాలో మేము పార్టీ మారినట్లు, బిఆర్ఎస్ వీడి కాంగ్రెస్లో చేరినట్లు వక్రీకరించారు. పార్టీ మారినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేస్తున్నారు. సుప్రీం కోర్టులో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై ఇప్పటి వరకు జరిగిన వాదనలు చూస్తే పార్టీ ఫిరాయించిన వారికి గట్టి ఎదురుదెబ్బ తగిలే అవకాశం కనిపిస్తోంది. దీంతో పదిమంది ఎమ్మెల్యేలు రూట్ మార్చి మేము పార్టీ ఫిరాయించలేదు, కాంగ్రెస్ పార్టీలో చేరలేదు అంటూ సుప్రీంకోర్టులో అఫిడవిట్ లు దాఖలు చేస్తున్నారు.
గూడెం మహిపాల్ రెడ్డి పార్టీ ఫిరాయించిన విషయం తెలిసిందే, అయితే సుప్రీంకోర్టులో మాత్రం పార్టీ మారలేదు. కాంగ్రెస్ పార్టీలో చేరినట్టు వచ్చిన వార్తలు అవాస్తవం, బీఆర్ఎస్ పార్టీతో మంచి అనుబంధం ఉందని చెప్పుకొచ్చారు. శాసనసభకు మూడోసారి ఎన్నికయ్యాక, వ్యక్తిగత స్థాయిలో ముఖ్యమంత్రిని కలిశానని, పార్టీ మారలేదని, సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అఫిడవిట్లపై మార్చి 25వ తేదీ సుప్రీంకోర్టు ఎలా స్పందిస్తుందో చూడాలి.