ఏదో సామెత చెప్పినట్టు మాజీ సీఎం వైఎస్ జగన్ కు అన్నీ ఉన్నా అదృష్టం అయితే కలిసిరావడం లేదు. రోజురోజుకు రాష్ట్రంలో పార్టీ బలహీనపడుతోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి 2004లో సీఎం అయిన తర్వాత అటు అభివృద్ధికి, ఇటు సంక్షేమానికి సమ ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు పేద, బడుగు, బలహీనవర్గాలకు ప్రయోజనం చేకూర్చే, ప్రతిపక్ష పార్టీ నేతలు సైతం విమర్శించలేని గొప్ప పథకాలను అమలు చేయడం ద్వారా 2009లో మళ్లీ సీఎం అయ్యారు.

 
అయితే జగన్ మాత్రం తన చుట్టూ ఉన్న కోటరీ, ఐ ప్యాక్ మాటలు నమ్మి 2024 ఎన్నికల్లో వైసీపీ ఘోర ఫలితాలు సాధించడానికి కారణమయ్యారు. సొంత కుటుంబ సభ్యులు, నమ్మకంగా ఉన్న వ్యక్తులు సైతం జగన్ కు ఒక్కొక్కరుగా దూరమవుతున్నారు. జగన్ తీరు వల్ల పార్టీ పుంజుకోవడం సులువు కాదనే అభిప్రాయం వైసీపీ కార్యకర్తల్లో, ఆ పార్టీ శ్రేయోభిలాషుల్లో ఉంది. అయితే జగన్ కు కానీ, పార్టీకి కాని పూర్వ వైభవం రావాలంటే ప్రధానంగా 5 విషయాల్లో మారాల్సి ఉంది.

 
తన కోటరీపై తరచూ విమర్శలు వస్తున్న నేపథ్యంలో జగన్ ఆత్మ పరిశీలన చేసుకుని పార్టీకి నష్టం చేకూరుస్తున్న వ్యక్తులను దూరం పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. పార్టీ బలంగా లేని చోట్ల పార్టీ కోసం కష్టపడుతున్న కొత్త ఇంఛార్జ్ లకు అవకాశం ఇస్తూ వైసీపీకి మరో ఛాన్స్ దక్కితే భవిష్యత్తులో మెరుగైన పాలన అందిస్తామనే నమ్మకాన్ని జగన్ కలిగించాల్సి ఉంది.

 
కుటుంబ సభ్యులతో ఉన్న చిన్నచిన్న సమస్యలను జగన్ పరిష్కరించుకుంటే మంచిది. జగన్ ఒంటరిగా రాజకీయాల్లో ఎంత పోరాడినా ఆశాజనకంగా ఫలితాలు రావు. జగన్ పాదయాత్ర దిశగా మరోసారి అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. ప్రజలు జగన్ నుంచి ఏం కోరుకుంటున్నారో తెలిస్తే మాత్రమే జగన్ లో మార్పు వస్తుందని చెప్పవచ్చు. ఇతర రాష్ట్రాల నేతల సపోర్ట్ పొందితే జగన్ కు రాజకీయంగా మరింత మేలు జరుగుతుంది. అయితే జగన్ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: