
తాజాగా అసెంబ్లీ వర్గీకరణ నివేదిక బిల్లుకు ఆమోదం తెలిపింది. దీని ప్రకారం.. రెల్లిసామాజికవర్గం సహా ఆ వర్గంలోని ఉప కులాలకు .. 1 శాతం రిజర్వేషన్ లభిస్తుంది. ఇక, మాదిగ సామాజిక వర్గం, ఉప కులాల కు 6.5 శాతం, మాల సామాజిక వర్గం సహా ఉప కులాలకు 7.5 శాతం రిజర్వేషన్ దక్కుతుంది. మొత్తంగా భారత రాజ్యాంగం పేర్కొన్న 15 శాతం రిజర్వేషన్‌ను ఏక సభ్య కమిషన్.. ఇలా సర్దుబాటు చేసింది. పైకి చూసేందుకు అద్భుతమే అయినా.. దీనిపై ఆయా వర్గాలు సంతోషంగా లేవన్నది వాస్తవం.
ప్రధానంగా ఇప్పటి వరకు రిజర్వేషన్‌లో మాల సామాజిక వర్గం మెజారిటీ ఫలాలు అందుకుంటోంది. కానీ, ఇప్పుడు వారికి దక్కుతున్న రిజర్వేషన్‌లో కోత పెట్టి.. 7.5 శాతానికి పరిమితం చేయడంతో ఆ వర్గం కూట మి సర్కారుపై నిప్పులు చెరుగుతోంది. తమకు జనాభా దామాషా ప్రకారం 9 నుంచి 10 శాతం రిజర్వేషన్ అయినా.. కల్పించాలని కోరుతున్నారు. పైగా.. ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లోనే ఏకసభ్య కమిషన్ పర్యటిం చిందని.. తమ డిమాండ్లను పట్టించుకోలేదని.. మాల వర్గాలు చెబుతున్నాయి.
ఇక, రెల్లి సామాజిక వర్గం అయితే.. పెదవి విరిచింది. వాస్తవానికి ఈ వర్గం ప్రజలు ఉమ్మడి కృష్ణా, గుంటూ రు జిల్లాలకే పరిమితం అయ్యారు. అయినప్పటికీ.. తమకు కనీసంలో కనీసం 2-3 శాతం రిజర్వేషన్ కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. కానీ, ఏకసభ్య కమిషన్ మాత్రం కేవలం 1 శాతానికే పరిమితమైంది. ఈ పరిణామాలతో కూటమి సర్కారుకు ఆయా వర్గాలు దూరమయ్యే అవకాశం ఉంది. ఇప్పటికే మాల సామాజిక వర్గం.. టీడీపీ-జనసేనలకు వ్యతిరేకంగా తీర్మానం చేయడం గమనార్హం. మున్ముందు ఈ వ్యవహారం మరింత రగులుకునే అవకాశం ఉందని తెలుస్తోంది.