
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గతంలో ఓ మంచి నిర్ణయం తీసుకున్నారు. హైదరాబాద్ లో ఐటీ జాబ్ లు చేసేవారు, నైట్ డ్యూటీలు చేసేవారు, ఇతరులు చాలా మంది అర్ధరాత్రి వరకు ఉండేవారు. కానీ ఫుడ్ కోర్టులు పది వరకే క్లోజ్ చేయడంతో వారంతా ఆకలికి ఇబ్బందులు పడేవారు. వీరి బాధలు అర్థం చేసుకున్న రేవంత్ రెడ్డి అర్ధరాత్రి వరకు ఫుడ్ కోర్టులు ఉండేలా అనుమతులిచ్చారు. ఇక ఇప్పుడు తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సైతం ఇలాంటి నిర్ణయమే తీసుకున్నారు.
ఏపీలో రాజధాని అమరావతి పరిధిలోకి వచ్చే విజయవాడ నగరంలో అర్ధరాత్రి ఫుడ్ లవర్స్ కు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ముఖ్యంగా రాత్రి వేళల్లో బస్సులు, రైళ్లలో నగరానికి చేరుకొని తిండి కోసం అల్లాడుతున్న ప్రయాణికులకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడను కాస్మాపాలిటిన్ సిటీగా మార్చే దిశగా అడుగులు వేస్తున్న చంద్రబాబు ఇందులో భాగంగా అర్థరాత్రి పన్నెండు గంటల వరకు అన్ని రెస్టారెంట్లు..హోటళ్లు తెరిచి ఉంచేందుకు వీలుగా ఉత్తర్వులు జారీ చేవారు. ఇదొక్క విజయవాడ నగరం వరకు మాత్రమే కాకుండా ఎన్టీఆర్ జిల్లా పరిధి మొత్తానికి వీలుగా అనుమతులు ఇచ్చారు.
ఈ ఉత్తర్వుల్ని ఆదివారం అర్థరాత్రి నుంచే అమలు చేయటం ఆసక్తికరంగా మారింది. నిజానికి 2018లోనే చంద్రబాబు ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు హోటళ్లు అర్థరాత్రి వరకు తెరిచి ఉంచేందుకు వీలుగా అనుమతులు జారీ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కానీ.. వాటి అమలు జరగలేదు. తాజాగా విజయవాడ పోలీస్ కమిషనర్ రాజశేఖరబాబు ఈ ఆదేశాల్ని జారీ చేశారు.
మొదట మూడు నెలల పాటు ఈ నిర్ణయాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేస్తారు. ఆ తర్వాత తుది నిర్ణయాన్ని తీసుకుంటారు. ఏ పన్ను చెల్లించని వారికి అర్థరాత్రి వరకు అనుమతి ఇస్తున్నప్పుడు.. 13 రకాల పన్నులు చెల్లిస్తున్న హోటళ్లు.. రెస్టారెంట్లకు ఎందుకు అనుమతి ఇవ్వకూడదని ముఖ్యమంత్రి చంద్రబాబును వ్యాపార వర్గాలు కోరటం.. అందుకు తగ్గట్లు ఆయన సానుకూలంగా స్పందించటం గమనార్హం. ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం విజయవాడ వాసులకు మాత్రమే కాదు.. విజయవాడకు వివిధ పనుల మీద వెళ్లే ఇతర ప్రాంతాల ప్రజలకు సౌకర్యవంతంగా ఉంటుందని చెప్పక తప్పదు.