
వైసీపీ ఓటమి తర్వాత ఆ పార్టీ గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటుంది. వరుసగా ముఖ్య నేతలు పార్టీని మారుతున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేతల్ని బీజేపీ చేర్చుకుంటూ పార్టీ బలం పెంచుకుంటోంది. ఇటీవల వైసీపీ రాజ్యసభ సభ్యులు రాజీనామా చేయగా వాటిని తమ ఖాతాలో వేసుకొని కాషాయ దళం పుంజుకునే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల కాలంలో ఆ పార్టీలో వలసలు కూడా ఎక్కువయ్యాయి.
ఇక మొన్నటి వరకు జగన్ కు అనుకూలంగా వ్యవహరించారనే బీజేపీ కీలక నేత సోము వీర్రాజుపై ఆరోపణలు ఉన్నాయి. తాజాగా సోము వీర్రాజుకు ఆ ఆపార్టీ అధిష్ఠానం ఎమ్మెల్సీ కట్టబెట్టింది. ఈ నేపథ్యంలో తాజాగా సోము వీర్రాజు వైసీపీ గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీని ఖాళీ చేయడమే టీడీపీ కూటమి లక్ష్యమని బిగ్ సౌండ్ చేశారు. ఏపీలో అభివృద్ధికి వైసీపీ విఘాతం అని కూడా అన్నారు. విశాఖ పర్యటనలో భాగంగా సోము వీర్రాజు వైసీపీ నుంచి వచ్చి చేరిన వారికి బీజేపీ కండువాలు కప్పారు.
వైసీపీని మళ్ళీ జనాలు ఎన్నుకోరని స్పష్టం చేశారు. అసెంబ్లీకి వెళ్ళని వారికి పదవులు ఎందుకు అని జగన్ మీద హాట్ కామెంట్స్ చేశారు. అసెంబ్లీకి రావాలి అంటే ప్రతిపక్ష హోదా కావాలని జగన్ కోరుతున్నారని కానీ ఇదే జగన్ కి 2014 నుంచి 2019 మధ్యలో ప్రధాన ప్రతిపక్ష హోదాకు సరిపడా సీట్లు ఇచ్చి జనాలు పంపించారని గుర్తు చేశారు. కానీ అపుడు ఆయన చేసిందేంటి అని సోము నిలదీశారు.
జగన్ తొలి మూడేళ్ళు మాత్రమే అసెంబ్లీకి హాజరయ్యారని ఆ తరువాత ఆయన అసెంబ్లీ ముఖం చూడలేదని అన్నారు. ప్రతిపక్ష హోదా ఇచ్చినా జగన్ చేసేది అదే అని తేల్చేశారు. ఏపీలో పాలన గాడిన పెడుతోంది కూటమి ప్రభుత్వమే అని ఆయన అన్నారు. జగన్ ఏలుబడిలో ఏపీ అన్ని రకాలుగా ఇబ్బందుల పాలు అయింది అన్నది జనాలకు బాగా తెలుసు అని సోము వీర్రాజు ఎద్దేవా చేశారు. మొత్తం మీద చూస్తే ఏపీలో వైసీపీని లేకుండా చేస్తామని సోము వీర్రాజు ప్రకటించారు. మూడు పార్టీలే కూటమిగా ఉన్నాయని ఆ పార్టీలదే భవిష్యత్తు అని అన్నారు.