
తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్, ఏపీ మాజీ సీఎం జగన్ ల మధ్య సాన్నిహిత్య సంబంధం గురించి మనకి తెలిసిందే. 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలైన తర్వాత కూడా 2024లో జరిగిన సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా జగనే గెలుస్తారు అని జోస్యం చెప్పారు. కానీ కేసీఆర్ అంచనాలు తారుమారు అయ్యాయి. ఏకంగా 164 సీట్లతో కూటమి అధికారంలోకి వచ్చింది. ఆ తర్వాత నుంచి కేసీఆర్ సైలెంట్ మూడ్ లోకి వెళ్లిపోయారు. కూటమి విజయం గురించి కానీ.. జగన్ ఓటమి గురించి మాట్లాడలేదు.
ఇక చంద్రబాబు అధికారం చేపట్టి పది నెలుల గడుస్తోంది. ఏపీ పాలనను గాడిన పెడుతున్నారని కూటమి నేతలు చెబుతున్నారు. ఇలాంటి సమయంలో కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అదీ కూడా సందర్భం లేకుండా. కేవలం పొత్తుల వల్లే చంద్రబాబు గెలిచారు అని హాట్ కామెంట్స్ చేశారు. వాస్తవానికి ఇప్పుడు చంద్రబాబు ప్రస్తావన అనవసరం. కానీ కేసీఆర్ చంద్రబాబుని టార్గెట్ చేయడం వెనుక వ్యూహం ఏమై ఉంటుందా అని రాజకీయ విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.
ఏదైనా వ్యూహం లేకుండా కెసిఆర్ అలా మాట్లాడరు. పైగా తెలంగాణలో చంద్రబాబు రాజకీయం చేయడం లేదు. అటువంటి చంద్రబాబు ప్రస్తావన కెసిఆర్ తీసుకొచ్చారంటే తెర వెనుక ఏదో జరుగుతోందన్న ప్రచారం నడుస్తోంది. తెలంగాణలో బీజేపీ క్రమక్రమంగా బలపడుతోంది. ఏపీలో కూటమి పార్టీలు బలంగా ఉన్నాయి. ఇక జనసేన కు సైతం అంతో ఇంతో ఆదరణ ఉంది. ఇక టీడీపీకి సంప్రదాయ ఓటు బ్యాంకు ఉంది.
ఈ క్రమంలో తెలంగాణలో ఎన్డీఏని యాక్టివ్ చేయాలనే ఆలోచనలో బీజేపీ నేతలు ఉన్నారు. తద్వారా తెలంగాణలో బలపడలానే బీజేపీ భావిస్తోంది. ఇందులో భాగంగా అందివచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే చూస్తోంది. ఈ క్రమంలో చంద్రబాబుని దెబ్బ తీసి సెల్ప్ ఢిపెన్స్ లో పడేయడానికే ఆ తరహా వ్యాఖ్యలు చేశారని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఒకవేళ తెలంగాణలో బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి బలపడితే అది అంతిమంగా బీఆర్ఎస్ కు నష్టం చేకూరుస్తుంది. దీని ప్రభావం బీఆర్ఎస్ ఓటు బ్యాంకును చీలుస్తుంది. ఈ నేపథ్యంలో కేసీఆర్ తాజా వ్యాఖ్యలు చేశారనే వాదన కూడా ఉంది. మరి చూడాలి కేసీఆర్ ఏ ఉద్దేశంలో ఈ వ్యాఖ్యలు చేశారో.