
భారతీయ విద్యార్థులకు అమెరికా ఇచ్చే విద్యార్థి వీసాల సంఖ్య గణనీయంగా తగ్గిపోతోంది. డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి వలసదారులపై కక్ష కట్టిన విషయం తెలిసిందే. ఆయన అమెరికా ఫస్ట్ అనే నినాదంతో పని చేస్తున్నారు. ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం మొత్తంగానే విద్యార్థి వీసాలను తగ్గించింది. ఈ క్రమంలో భారతీయ విద్యార్థులు అవకాశాలు కూడా భారీగా తగ్గాయి.
విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని కలలు కనేవారికి అమెరికా ఒక ముఖ్య గమ్యస్థానం. అయితే, గత కొంతకాలంగా అమెరికా ప్రభుత్వం విద్యార్థి వీసాల (F-1 visa) జారీ విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది. తాజా గణాంకాల ప్రకారం గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా 41 శాతం దరఖాస్తులను తిరస్కరించడం గమనార్హం. ఇది దశాబ్దం క్రితంతో పోలిస్తే దాదాపు రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.
అమెరికా విదేశాంగ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2023-24 ఆర్థిక సంవత్సరంలో F-1 వీసా కోసం మొత్తం 6.79 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దురదృష్టవశాత్తు వీటిలో 2.79 లక్షల దరఖాస్తులను అధికారులు తిరస్కరించారు. అంతకు ముందు సంవత్సరం 2022-23లో కూడా ఇదే పరిస్థితి కొనసాగింది. ఆ ఏడాది 6.99 లక్షల దరఖాస్తులు రాగా, 2.53 లక్షల దరఖాస్తులను తిరస్కరించారు.
ఈ పరిస్థితి గత దశాబ్దంతో పోలిస్తే తీవ్రంగా మారింది. 2013-14 ఆర్థిక సంవత్సరంలో 7.69 లక్షల మంది విద్యార్థులు వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటే, కేవలం 1.73 లక్షల దరఖాస్తులు మాత్రమే తిరస్కరణకు గురయ్యాయి. అంటే, అప్పటి తిరస్కరణ రేటు 23 శాతంగా ఉండగా, గత ఏడాది అది 41 శాతానికి పెరగడం గమనార్హం.
2024 సంవత్సరం మొదటి తొమ్మిది నెలల గణాంకాలను పరిశీలిస్తే, భారతీయ విద్యార్థులకు F-1 వీసాల జారీ 38 శాతం తగ్గిపోయింది. కోవిడ్ మహమ్మారి తర్వాత భారతీయ విద్యార్థులకు ఈ స్థాయిలో వీసాల సంఖ్య తగ్గడం ఇదే మొదటిసారి. బ్యూరో ఆఫ్ కాన్సులర్ అఫైర్స్ నెలవారీ నివేదికల ప్రకారం, 2024 జనవరి నుంచి సెప్టెంబరు మధ్య కేవలం 64 వేల మంది భారతీయ విద్యార్థులకు మాత్రమే F-1 వీసాలు జారీ చేయబడ్డాయి. అంతకు ముందు సంవత్సరం, 2023 ఇదే సమయంలో ఈ సంఖ్య 1.03 లక్షలుగా ఉండటం పరిస్థితి తీవ్రతను తెలియజేస్తోంది.