
అసెంబ్లీలో ఒక ఆసక్తికర అంశం చర్చకు వచ్చింది. ఐటీ ఉద్యోగులు అంటేనే ఆరు అంకెల్లో జీతం.. భారీ వార్షిక ప్యాకేజీలు, వీకెండ్లు, పార్టీలు ఇలా భారీగా ఊహించుకుంటారు. కానీ వారి కష్టాన్ని గుర్తించే వారు చాలా తక్కువ మందే ఉంటారు. ఇక వీరి గురించి అసెంబ్లీలో మాట్లాడతారు అని ఐటీ ఉద్యోగులు కూడా ఊహించి ఉండరు. ఇక సీపీఐ ఏకైన ఎమ్మెల్యే మాత్రం ఐటీ ఉద్యోగుల గురించి ఆలోచించారు. వారి బాధను అర్థం చేసుకున్నాడు. నిండు అసెంబ్లీలో నిలదీశారు.
దీంతో ఐటీ ఉద్యోగుల కోసం నిలబడ్డ ఆ ఎమ్మెల్యేపై ప్రశంసలు కురుస్తున్నాయి. అతనే కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు. తెలంగాణ అసెంబ్లీలో హైదరాబాద్‌లోని ఐటీ ఉద్యోగుల దుస్థితిపై గళం విప్పారు. తెలంగాణలోని సాఫ్ట్‌వేర్ కంపెనీలలో ఎంత మంది ఐటీ ఉద్యోగులు పనిచేస్తున్నారో, వారికి కార్మిక చట్టాలు వర్తిస్తాయో లేదో ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చాలా మంది సాఫ్ట్‌వేర్ ఉద్యోగులకు రోజుకు 10 గంటల పని తప్పనిసరి అని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.
వారికి పదవీ విరమణ వయస్సు ఉందా . చట్ట ప్రకారం ఏదైనా పదవీ విరమణ ప్రయోజనాలు లేదా ఇతర సౌకర్యాలు ఉన్నాయా అని కూనంనేని నిలదీశారు. ఐటీ దిగ్గజాలు తమ అమాయక ఉద్యోగుల శ్రమను దోచుకుంటున్నారని ఆయన ఆవేదన చెందారు. కంపెనీలు వారి యవ్వనం, శక్తి , తెలివితేటలను దోచుకుంటున్నాయి. లక్షల కోట్లు సంపాదిస్తున్నాయి, కానీ ఉద్యోగులకు సరైన గుర్తింపు ఇవ్వడం లేదని ఆయన విమర్శించారు.
ఈ ఉద్యోగులు 50 ఏళ్లకే కీళ్ల , నడుము నొప్పితో వృద్ధులవుతున్నారని కూనంనేని ఆవేదన వ్యక్తం చేశారు. వారు తమ తల్లిదండ్రులతో సమయం గడపలేకపోతున్నారని, భార్యాభర్తలు బయటకు వెళ్లి సినిమా చూడలేరని లేదా తమ పిల్లలతో ఆడుకోలేకపోతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ఇలా నిండు అసెంబ్లీలో ఏవేవో పక్కదారి పట్టించే టాపిక్ లపై చర్చ జరుగుతున్న వేళ సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని ఐటీ ఉద్యోగుల సమస్యలను అసెంబ్లీలో ప్రస్తావించి వారి పాలిట ఆదర్శప్రాయుడు అయిపోయాడు. ఐటీ ఉద్యోగులపై గళమెత్తిన ఏకైక ఎమ్మెల్యే కూనంనేని అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.