
ఏపీ అప్పుల గురించి ప్రస్తావన ఎప్పుడు వచ్చినా అది హాట్ టాపిక్ గానే ఉంటుంది. ఎందుకంటే జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎడాపెడా అప్పులు చేశారని.. అభివృద్ధి ఆగిపోయిందని.. రుణాలు తెచ్చి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని కూటమి నేతలు పదే పదే ఆరోపించారు. అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు అయితే ఏకంగా ఏపీ మరో శ్రీలంకగా మారుతుందని విమర్శించారు. జగన్ ప్రభుత్వం రూ.10లక్షల కోట్లు అప్పులు చేసిందని ప్రచారం చేసి దానిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విజయవంతం అయ్యారు.
ఇక కట్ చేస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు ఏపీ అప్పులు లెక్కలు బయటకు వస్తున్నాయి. తాజాగా పార్లమెంట్ సాక్షిగా ఏపీ అప్పుల ప్రస్తావన తెరపైకి వచ్చింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ప్రస్తుత 2024-25 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి అంటే మార్చి నెలాఖరుకు రూ.5.62 లక్షల కోట్లకు చేరుకుంటాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు.
రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జీఎస్‌డీపీ)లో ఈ అప్పులు 34.70 శాతంగా ఉంటాయని ఆయన తెలిపారు. అంతకుముందు ఆర్థిక సంవత్సరం అంటే 2023-24లో రాష్ట్ర జీఎస్‌డీపీలో అప్పులు 34.58 శాతంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. లోక్‌సభ సభ్యుడు మనీష్ తివారి అడిగిన ప్రశ్నకు సమాధానంగా పంకజ్ చౌదరి దేశంలోని వివిధ రాష్ట్రాల అప్పుల వివరాలను సభకు తెలియజేశారు. రాష్ట్రాల నికర రుణ పరిమితిని ప్రతి ఆర్థిక సంవత్సరం ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వం నిర్ణయిస్తుందని స్పష్టం చేశారు. దేశంలోని అన్ని రాష్ట్రాలు ఆర్థిక బాధ్యత, బడ్జెట్ నిర్వహణ (ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టాన్ని తప్పనిసరిగా అమలు చేస్తున్నాయని ఆయన తెలిపారు.
రాష్ట్రాలు తీసుకుంటున్న అప్పులు ఎఫ్‌ఆర్‌బీఎం చట్టానికి అనుగుణంగా ఉన్నాయా లేదా అనే విషయాన్ని ఆయా రాష్ట్రాల శాసనసభలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తాయని పంకజ్ చౌదరి లోక్‌సభకు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అప్పులు ఈ ఆర్థిక సంవత్సరం చివరి నాటికి గణనీయంగా పెరుగుతాయని కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించడం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై చర్చకు దారితీసే అవకాశం ఉంది. దీనిపై వైసీపీ గట్టిగానే కౌంటర్ ఇస్తోంది. అప్పుడు చంద్రబాబు చేసిందంతా అబద్ధపు ప్రచారమే అని విమర్శిస్తోంది.