
అంతర్జాతీయ మౌలిక సదుపాయాలతో దేశంలోనే ఇతర మెట్రో నగరాలకంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ రంగం బాగుంటుంది. స్థిరాస్తి వ్యాపారంలో ముంబై, ఢిల్లీ, బెంగళూరు, నాగ్ పూర్, లక్నో వంటి నగరాలు ముందు వరుసలో ఉంటాయి. ఈ ప్రాంతాలలో భారీగా స్థిరాస్తి వ్యాపారం జరుగుతూ ఉంటుంది. ఈ నగరాలలో పాటు హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారం సాగుతూ ఉంటుంది.
ఔటర్ రింగ్ రోడ్డు నిర్మించడం.. బహుళ కంపెనీలు ఏర్పాటు కావడంతో రియల్ ఎస్టేట్ గత కొన్ని సంవత్సరాలుగా అంచనాలకు మించి ఎదుగుతోంది. భూములకు ధర విపరీతంగా పెరగడంతో హైదరాబాద్ నగరంలో ఉన్న చెరువులు మొత్తం కబ్జాకు గురయ్యాయి. నాలాలు నామరూపాలను కోల్పోయాయి. వర్షాలు వస్తే చాలు హైదరాబాద్ నగరంలో కాలనీలకు కాలనీలు నీట మునిగిపోతున్నాయి. అయితే ఈ పరిస్థితిని నివారించేందుకు రాష్ట్ర ప్రభుత్వం హైడ్రాను తెరపైకి తీసుకువచ్చింది.
ఏడాది కాలంగా భాగ్యనగరంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బతిందని ప్రాప్ ఈక్విటీ అనే సంస్థ తన సర్వే ద్వారా తెలిపింది. గడిచిన ఏడాదిన్నర కాలంలో జరిగిన క్రయ విక్రయాలు, లీజు లావాదేవీలను పరిగణనలోకి తీసుకొని తాజాగా ఈ నివేదిక విడుదల చేసింది. ఒక్క హైదరాబాదే కాకుండా ముంబయి, కోల్ కతా, థాణే, దిల్లీ చెన్నై, బెంగళూరు వంటి నగరాల్లో కూడా సర్వే నిర్వహించింది.
మిగతా నగరాలతో పోలిస్తే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ తగ్గుదల నమోదైందని తన సర్వేలో ప్రాప్ ఈక్విటీ అభిప్రాయపడింది. గతేడాదితో పోల్చితే ఈ సారి 47 శాతం అమ్మకాలు పడిపోయాయి. గత తొలి త్రైమాసికంలో 20835 యూనిట్లను విక్రయించగా ఈ ఏడాది అమ్మకాలు 11114 యూనిట్లకు పడిపోయినట్లు తెలపింది. పడిపోయిన యూనిట్ల విలువ రూ.6నుంచి 7వేల కోట్లు వరకు ఉంటుందని అంచనా వేసింది. ఇక దీనిపై బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం ఎమ్మెల్యేలు అసెంబ్లీ వేదికగా విమర్శలు మొదలు పెట్టారు.
దీనిపై ఎంఐఎం ఎమ్మెల్యే అసదుద్దీన్ ఓవైసీ శాసనసభ వేదికగా ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. ” హైడ్రా అనే వ్యవస్థను తెరపైకి తీసుకొచ్చారు. దీనివల్ల ఆక్రమణలు తొలగింపు మాట ఏమిటో గాని.. హైదరాబాద్ లోని రియల్ ఎస్టేట్ మొత్తం కుప్పకూలిపోయింది. ఇప్పట్లో తిరిగి లేచే అవకాశం లేదు. దీనికి ప్రధాన కారణం ప్రభుత్వం తీసుకొచ్చిన హైడ్రానే అని విమర్శించారు.