
బెట్టింగ్స్ యాప్స్ పై యూట్యూబర్ అన్వేష్ స్టార్ట్ చేసిన పోరాటం జాతీయ స్థాయిలో సంచలనం రేపుతోంది. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో ఇప్పటికీ పలువురు యూట్యూబర్లు, టాలీవుడ్ స్టార్లపై కేసు నమోదు చేశారు పోలీసులు. బెట్టింగ్ యాప్స్ కారణంగా అనేక మంది అమాయకులు తమ ప్రాణాలు కోల్పోతున్నారు. దీంతో తెలంగాణ పోలీసులు ఈ బెట్టింగ్స్ యాప్స్‌పై ప్రత్యేక దృష్టిని సారించారు.
బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్లు, యూట్యూబర్లు, సెలబ్రిటీలపై పోలీసులు కేసులు నమోదు చేశారు.బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న 11 మంది తెలుగు సెలబ్రిటీలపై కేసులు నమోదు చేశారు.
హర్షసాయి, పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్ ఖాన్, టెస్టీ తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతూ చౌదరి, బండారు షేషయాని సుప్రిత తదితరులపై పంజాగుట్ట పోలీసులు కేసులు నమోదు చేశారు. దీనిలో భాగంగానే విష్ణుప్రియ, రీతూ చౌదరి పోలీసుల విచారణకు హాజరయ్యారు. రానా దగ్గుబాటి, విజయ్ దేవరకొండలు సైతం దీనిపై బహిరంగ ప్రకటన చేశారు.
ఇప్పుడు సీన్‌లోకి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎంటరయ్యారు. బెట్టింగ్ యాప్‌లు వాటిని ప్రమోట్ చేస్తున్న సినీ హీరోలపై కఠిన చర్యలు తీసుకోవాలని రెండు రోజుల క్రితం డిమాండ్ చేశారు. లేదంటే తానే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తానని తెలిపారు. తాజాగా ఆయన అన్నంత పని చేశారు. బెట్టింగ్ యాప్స్ పై సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు కేఏ పాల్.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ కంటే ఈ గేమింగ్, బెట్టింగ్ యాప్స్ ప్రమాదకరమిని.. నేటి సమాజంలో ప్రతి ఒక్కరి చేతిలో ఉన్న స్మార్ట్ ఫోన్‌లో ఈ యాప్స్ ఉంటాయని అన్నారు.సెలబ్రిటీలను యువత, విద్యార్థులు రోల్ మోడల్‌గా తీసుకుంటారని, కానీ వారంతా ప్రస్తుతం సైతాన్లుగా మారారని కేఏ పాల్ విమర్శించారు. బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసిన సెలబ్రేటీలు, నటులు.. తమ తప్పును ఒప్పుకొని 72 గంటల్లోగా క్షమాపణలు చెప్పాలని, వారి వల్ల నష్టపోయిన వారికి వారి కుటుంబాలకు పరిహారం ఇప్పించాలని డిమాండ్ చేశారు.