సీఎం రేవంత్ రెడ్డి శాసన మండలిలో విద్యా విధానంపై ప్రత్యేక దృష్టి సారించారు. విద్యా రంగంలో సమూల సంస్కరణల కోసం ప్రభుత్వం కృషి చేస్తోందని, ఈ లక్ష్యంతోనే విద్యా కమిషన్‌ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఈ కమిషన్‌కు ఒక ఐఏఎస్ అధికారిని ఛైర్మన్‌గా నియమించి, రాష్ట్రవ్యాప్తంగా పర్యటించి సలహాలు, సూచనలు సేకరించేలా చర్యలు తీసుకున్నామని వివరించారు. 2021లో జరిగిన నేషనల్ అచీవ్‌మెంట్ సర్వే ఫలితాలను ఉటంకిస్తూ, 3వ మరియు 5వ తరగతి విద్యార్థుల్లో 75 శాతం మంది కనీస సామర్థ్యాలు కూడా చూపలేని దుస్థితిని ఎత్తి చూపారు. ఈ సర్వేలో తెలంగాణ చివరి నుంచి ఐదో స్థానంలో నిలిచినప్పటికీ, 3వ తరగతి విద్యార్థులకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ పరిజ్ఞానంలో 36వ స్థానంలో, గణితంలో 35వ స్థానంలో ఉండటం రాష్ట్ర విద్యా వ్యవస్థ బలహీనతను సూచిస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు.

రేవంత్ రెడ్డి అసెంబ్లీలో  మాట్లాడుతూ, దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోలిస్తే తెలంగాణ విద్యా రంగం అధమ స్థానంలో ఉందని, ప్రభుత్వ పాఠశాలల్లో ఐదో తరగతి విద్యార్థులు రెండో తరగతి పుస్తకాలు కూడా చదవలేని దుర్భర పరిస్థితి నెలకొన్నదని విమర్శించారు. విద్యా రంగం రోజురోజుకూ క్షీణిస్తున్నదని, దీన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 11 వేలకు పైగా ఉపాధ్యాయ నియామకాలు, 21 వేల మందికి పైగా పదోన్నతులు, ఏడెనిమిదేళ్లుగా పెండింగ్‌లో ఉన్న 36 వేల మంది టీచర్ల బదిలీలను చేపట్టినట్టు వెల్లడించారు. ఈ బదిలీలను ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా నిర్వహించామని, కలెక్టర్లను బదిలీ చేయడం సులభమైనా టీచర్ల బదిలీ అంత సామాన్యమైన విషయం కాదని అన్నారు.


ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులపై ఖర్చు విషయానికొస్తే, ఒక్కో విద్యార్థిపై సంవత్సరానికి రూ.1.08 లక్షలు, హాస్టళ్లలో చదివే వారిపై రూ.96 వేలు ఖర్చు చేస్తున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. మొత్తానికి రేవంత్ రెడ్డి విద్యా రంగంపై ఫోకస్ పెంచారన్నమాట.



మరింత సమాచారం తెలుసుకోండి: