సాధారణంగా భారతీయ జనతా పార్టీ ముస్లింల వ్యతిరేకి అనే ముద్ర ఉంది. ఆ పార్టీతో పొత్తు పెట్టుకునే పార్టీలను సైతం ముస్లింలు వ్యతిరేకిస్తుంటారు. అయితే ఇప్పుడు తాజాగా ముస్లింలు వ్యతిరేకించే ఓ బిల్లును కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చింది. అదే వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు. దీనిని  పార్లమెంట్ లో ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్ధమవుతున్న తరుణంలో దానికి మద్దతిస్తున్న కూటమి ప్రభుత్వంపైనా దాని ప్రభావం పడుతోంది.


ఈ క్రమంలో విజయవాడలో చంద్రబాబు ప్రభుత్వం అధికారికంగా ఇస్తున్న రంజాన్ ఇఫ్తార్ పార్టీతో పాటు జిల్లా కేంద్రాల్లో నిర్వహిస్తున్న పార్టీల్ని సైతం బహిష్కరించాలని ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు పిలుపునిచ్చింది.  విజయవాడలో ఈ మేరకు ప్రకటన చేసింది.


ముస్లింలకు రాజ్యాంగం కల్పించిన వక్ఫ్ ఆస్తి హక్కును కాలరాసేలా కేంద్రం తెస్తున్న బిల్లుకు చంద్రబాబు పార్టీ టీడీపీ మద్దతునివ్వడంపై ఆలిండియా ముస్లిం పర్సనల్ లాబోర్డు నేతలు మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో లాబోర్డు నాయకులు వక్ఫ్ బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు.  ఇందులో 41 సవరణలు ఉండగా.. వీటిలో నామమాత్రంగా ఆరు, ఏడు సవరణలు చేసి తిరిగి ప్రవేశపెట్టేందుకు కేంద్రం సిద్దమవుతోందని జమాతే ఇస్లామీ హింద్ రాష్ట్ర అధ్యక్షుడు రఫీక్ ఆరోపించారు. దీనికి నిరసనగా రాష్ట్ర ప్రభుత్వ ఇఫ్తార్ విందుల్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.


రాష్ట్రంలో అధికార కూటమి పార్టీలు కేంద్రం తెస్తున్న వివాదాస్పద వక్ఫ్ బిల్లుకు మద్దతు ఇస్తున్నందున వారు ఏర్పాటు చేస్తున్న రంజాన్ ఇఫ్తార్ విందుల్ని బాయ్ కాట్ చేసి దూరంగా ఉండాలని ముస్లింలకు పర్సనల్ లాబోర్డు పిలుపునిచ్చింది. తమకు రాజకీయ పార్టీలతో ఎలాంటి సంబంధం లేదని, అయితే వక్ఫ్ బిల్లుకు మద్దతునిస్తున్నందునే ఇఫ్తార్ విందుల బాయ్ కాట్ పిలుపు ఇస్తున్నట్లు తెలిపింది. తద్వారా తమ నిరసన తెలపబోతున్నట్లు లాబోర్డు నేతలు తెలిపారు. కాబట్టి ముస్లింలు ఎవరూ ఈ విందుల్లో పాల్గొనవద్దని కోరింది.


వక్ఫ్ సవరణ బిల్లును తక్షణమే ఉపసంహరించుకోవాలని.. ముస్లింల హక్కులను కాపాడేందుకు సీఎం చంద్రబాబు చొరవ తీసుకోవాలని కూడా కోరారు.   బిల్లులో పారదర్శకత లేదని, ముస్లింల పై జరుగుతున్న కుట్ర అని వారు ఆరోపించారు. భవిష్యత్తులో అన్నిమతాలకు ఇదే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశవ్యాప్తంగా వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా పోరాటాలు కొనసాగుతాయని, ఈనెల 29న విజయవాడ ధర్నా చౌక్ లో భారీ నిరసన చేపడతామని ప్రకటించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: