తెలంగాణలో కొన్ని రోజులుగా ఉప ఎన్నికల ప్రస్తావన బాగా తెరపైకి వస్తోంది. పార్టీ ఫిరాయించిన పది అసెంబ్లీ స్థానాల్లో కచ్ఛితంగా బై ఎలక్షన్స్ ఉంటాయని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎప్పుడో ప్రకటించారు. ఆయా స్థానాల్లో ఎన్నికలకు సిద్ధం కావాలని పార్టీ శ్రేణులకు సూచించారు. కాగా ప్రభుత్వం ఏడాది కాలంలోనే ప్రజా వ్యతిరేకత మూట కట్టుకుందని ఎన్నికల్లో గెలవడం ద్వారా ప్రభుత్వాన్ని మరింత ఇరుకున పెట్టొచ్చని బీఆర్ఎస్ ఆలోచనగా ఉంది.
అయితే అసెంబ్లీ సమావేశాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో ఉప ఎన్నికలపై కీలక ప్రకటన చేశారు. ఈ సమయంలో కేసీఆర్ ఆశలపై నీళ్లు కూడా చల్లినట్లు అయింది. ఉపఎన్నికలు వస్తాయంటూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేస్తున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ స్పందించారు. తెలంగాణలో ఇప్పట్లో ఉపఎన్నికల్లో వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు.
అసెంబ్లీ సభ్యులు ఈ విషయంలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు సీఎం రేవంత్. ఇలాంటి అంశాలపై కాకుండా ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం మేలని హితవు పలికారు. ఇతర పార్టీ నేతలు తమ పార్టీలోకి వచ్చినా.. మళ్లీ వెనక్కి వెళ్లినా.. వాటితో సంబంధం లేకుండా ఉపఎన్నికలు జరిగే పరిస్థితి లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి తన ప్రాధాన్యత అని చెప్పారు.
ఉపఎన్నికల గురించి చర్చించేందుకు తన సమయం వృథా చేసుకోవడం లేదన్నారు. ఈ అంశం సుప్రీంకోర్టు పరిధిలో ఉన్నందున.. తీర్పు వచ్చిన తర్వాత తాము దాన్ని స్వీకరిస్తామన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల విషయంలో గత ప్రభుత్వం పాటించిన సంప్రదాయాన్నే తాము కూడా పాటిస్తామని సీఎం చెప్పుకొచ్చారు. అయితే, ఆ పార్టీ అడుగుజాడల్లో నడవమని చెప్పారు. అలా చేస్తే ప్రజలు తమను కూడా ఇంటికి పంపిస్తారన్నారు.
గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు కూడా బీఆర్ఎస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. అయితే, అప్పుడు కూడా ఎలాంటి ఉపఎన్నికలు జరగకపోవడం గమనార్హం. ఈ నేపథ్యంలోనే గత సంప్రదాయాన్నే తాము కూడా కొనసాగిస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పుకొచ్చారు.