దిల్లీలో లిక్కర్ స్కాం ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. ఈ కేసులో కీలక, ప్రముఖ నేతలైన దిల్లీ మాజీ సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత, దిల్లీలోని కీలక ఆప్‌ నేతల అందరూ జైలు పాలయ్యారు.  చివరకు కేజ్రీవాల్‌ మాజీ సీఎం అయ్యేందుకు కూడా ఇదే కారణం అయింది.  ఇప్పుడు ఏపీలో కూడా లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టించేందుకు చంద్రబాబు సిద్ధమైనట్లు కనిపిస్తోంది.


వైసీపీ హయాంలో చోటు చేసుకున్న ఓ స్కాంపై ఇప్పుడు కీలక నిర్ణయం తీసుకునేందుకు కూటమి నేతలు సిద్ధమవుతున్నారు.  రాష్ట్రంలో గత ఐదేళ్ల వైసీపీ ప్రభుత్వంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వ్యవహారాల్లో మద్యం కూడా ఒకటి.  రాష్ట్రంలో మద్య నిషేధం పేరుతో ప్రధాన బ్రాండ్లను తరిమేసి, వాటి స్దానంలో సొంతంగా కంపెనీలు ఏర్పాటు చేసి నాసిరకం మద్యాన్ని భారీ రేట్లకు అమ్మి సొమ్ము చేసుకున్నట్లు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు వచ్చాయి.  ఇందులో దాదాపు 4 వేల కోట్లు చేతులు మారాయని, ఇందులో ఇద్దరు వైసీపీ ఎంపీల పాత్ర ఉన్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది.


ఇదే అంశాన్ని తాజాగా టీడీపీ నరసరావుపేట ఎంపీ లావు కృష్ణదేవరాయలు తాజాగా పార్లమెంట్ లోనూ ప్రస్తావించారు.  మద్యం స్కాంలో 4 వేల కోట్లు దేశం దాటిపోయాయని, దుబాయ్ తో పాటు ఆఫ్రికా దేశాలకు వాటిని తరలించారనే ఆరోపణలు చేశారు.  పార్లమెంట్లో ఈ వ్యవహారం ప్రస్తావన తర్వాత కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు కూడా టీడీపీ ఎంపీ లావు కృష్ణదేవరాయలు ఫిర్యాదు చేశారు.  


మద్యం స్కాంలో అప్పటి వైసీపీ ఎంపీలు మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి పాత్ర ఉందని కూటమి నేతలు ఇప్పటికే పలుమార్లు ఆరోపించారు.  ఇప్పుడు ఈ స్కాంపై దర్యాప్తు ప్రారంభించి, ఈడీ కూడా ఎంట్రీ ఇస్తే వైసీపీకి ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది. ఇక తర్వాత చంద్రబాబుని ఉండవల్లిలోని ఆయన నివాసంలో కలిసి లావు కృష్ణదేవరాయలు ఇదే విషయాన్ని చర్చించారని తెలుస్తోంది. ఇక ఈ విషయంలో కేంద్రం ఆధీనంలో ఉండే సీబీఐ లేదా ఈడీ దర్యాప్తును కోరుతున్నారు. దీనిపై పేర్ని నాని స్పందిస్తూ జగన్ ను ఇబ్బంది పెట్టేందుకు ఈ విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. మొత్తం మీద వైసీపీ బిగ్ షాట్స్ ని టార్గెట్ చేసి లిక్కర్ స్కాంలో తెలివిగా కూటమి ప్రభుత్వం పావులు కదుపుతోందని విశ్లేషకులు అంటున్నారు. చూడాలి తర్వాత ఏం జరుగుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: