మన దేశంలోని అత్యంత సంపన్నుల  తీరుకు సంబంధించిన ఒక షాకింగ్ నివేదిక వెలుగు చూసింది. సాధ్యమైనంత వరకు స్వదేశాన్ని వీడి విదేశాల్లో స్థిరపడాలనే ఆలోచనలో రిచ్ పర్సన్స్ ఉన్నట్లు ఓ సర్వే తెలిపింది.  కేవలం ఆలోచనే కాదు దీనిని ఆచరణలో కూడా పెడుతున్నారు.  కోటక్ ప్రైవేట్ - ఈవై నిర్వహించిన సంయుక్త సర్వేలో పలు షాకింగ్ అంశాల్ని వెల్లడించింది.  దేశంలోని జీవన పరిస్థితుల్లో పోలిస్తే మెరుగైన జీవన ప్రమాణాలు.. సులభతర వ్యాపార వాతావరణం ఉన్న దేశాలకు వెళ్లి.. అక్కడే స్థిరపడాలన్న యోచనలో ఉన్న వైనాన్ని వెల్లడించింది.


భారతీయ సంపన్నుల్లో 22 శాతం మంంది స్వేదేశాన్ని వీడాలనుకుంటున్నారు. వీరంతా మెరుగైన జీవన విధానం, పరిస్థితులు నాణ్యమైన జీవన ప్రమణాలు, సులభమైన వ్యాపారం వాతావరణం ఉన్న విదేశాలకు వలసపోవాలని అనుకుంటున్నట్లు తాజా సర్వే వెల్లడించింది.   విదేశాంగ శాఖ డేటా ప్రకారం ప్రతి ఏడాది 25 లక్షల మంది సంపన్న భారతీయులు దేశాన్ని విడిచి పెట్టేసి.. విదేశాలకు వలస వెళుతున్నారు.  


రూ.25 కోట్లు అంతకంటే ఎక్కువ ఆస్తులు ఉన్న వారు అమెరికా.. యూకే.. ఆస్ట్రేలియా.. కెనడా లాంటి దేశాలకు వెళ్లి స్థిరపడాలని భావిస్తున్నారని.. గోల్డెన్ వీసా పథకం అమలు చేస్తున్న యూఏఈ కూడా వారిని ఆకర్షిస్తుందని పేర్కొంది. ప్రతి ఐదుగురు కోటీశ్వరుల్లో ఒకరు విదేశాలకు వెళ్లేందుకు ప్లాన్ చేసుకుంటున్నారని.. భారతీయ పౌరసత్వాన్ని కొనసాగిస్తూనే.. అతిథ్య దేశాల్లో పర్మినెంట్ సిటిజన్స్ మాదిరి బతకాలని కోరుకుంటున్న వైనాన్ని వెల్లడించింది.  సర్వేలో పాల్గొన్న వారిలో విదేశాలకు వెళ్లి సెటిల్ కావాలని భావించే వారి సంఖ్య 66.66 శాతం ఉన్నట్లు వెల్లడైంది.


వేరే దేశానికి వలస వెళ్లటాన్ని 'ఫ్యూచర్ ఇన్వెస్ట్ మెంట్'గా భావిస్తుండటం గమనార్హం.  2023లో 2.83 లక్షల మంది భారతీయులు అత్యంత సంపన్నులుగా ఉన్నారు. వీరి మొత్తం సంపద విలువ రూ.283 లక్షల కోట్లు. 2028 నాటికి వీరి సంఖ్య 4.3 లక్షలకు చేరుకుంటుందని.. అప్పటికి వీరి సంపద మొత్తం రూ.359 లక్షల కోట్లకు చేరుకుంటుందని చెబుతున్నారు.  ఏమైనా.. అత్యంత సంపన్నులు దేశాన్ని విడిచి వెళ్లేందుకే మొగ్గు చూపుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: