సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. మేం కక్షపూరిత రాజకీయాలు చేయాలనుకుంటే కేటీఆర్‌ ఇప్పటికే చంచల్‌గూడ జైలులో ఉండేవారని అన్నారు. అనుమతి లేకుండా ఎవరైనా డ్రోన్‌ ఎగరవేస్తే రూ.500 జరిమానా విధిస్తారని చెప్పారు. డ్రోన్‌ ఎగరవేశానని ఎంపీని అయిన నా మీద కేసు పెట్టి చర్లపల్లి జైలులో వేశారని ఆవేదన వ్యక్తం చేశారు. రూ.500 జరిమానా వేసే కేసులో జైలులో పెట్టి వేధించారని ఆరోపించారు.


నా బిడ్డ పెళ్లికి కూడా మధ్యంతర బెయిలుపై వచ్చి వెళ్లానని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నేను కూడా అలా ప్రతీకార రాజకీయాలు చేయదలిస్తే ఇప్పటికే కొందరు జైలులో ఉండేవారని పేర్కొన్నారు. కేటీఆర్‌, కేసీఆర్‌కు జైలులో డబుల్‌బెడ్‌రూమ్‌ ఇల్లు కట్టించి ఇస్తానని అన్నానని చెప్పారు. కానీ అక్రమ కేసులు పెట్టి వాళ్లను జైలుకు పంపే కక్ష రాజకీయాలు చేసే వ్యక్తిని కాదని స్పష్టం చేశారు. కేటీఆర్‌, కేసీఆర్‌ను జైలులో వేయాలని చాలామంది మమ్మల్ని అడుగుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు.


బీఆర్‌ఎస్‌ మొదటి విడత ప్రభుత్వం కేవలం రూ.13 వేల కోట్లు రుణమాఫీ చేసిందని రేవంత్ రెడ్డి విమర్శించారు. తొలి విడత రుణమాఫీకి ఐదేళ్లు తీసుకున్నారని గుర్తు చేశారు. రెండోసారి గెలిచాక రుణమాఫీని అసలు పూర్తే చేయలేదని ఆరోపించారు. నాలుగేళ్ల తర్వాత మాత్రం రూ.11 వేల కోట్ల రుణమాఫీ చేశారని చెప్పారు. నాలుగేళ్ల తర్వాత రుణమాఫీ చేసినందుకు వాటికి వడ్డీ రూ.8500 కోట్లు పైగా అయ్యిందని వివరించారు. మేం అధికారంలోకి వచ్చిన ఆర్నెళ్లలోనే రూ.26 వేల కోట్లు రుణమాఫీ చేశామని తెలిపారు. ఎన్నికల కోడ్‌ అడ్డుపెట్టుకుని రైతుబంధు కూడా వేయలేదని విమర్శించారు. బీఆర్‌ఎస్‌ ఎగవేసిన రైతుబంధు రూ.7625 కోట్లు మేం చెల్లించామని చెప్పారు. వరి వేస్తే ఉరే అని స్వయంగా సీఎం బెదిరించారని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. మేం మాత్రం వరి వేసిన వారికి క్వింటాలుకు రూ.500 బోనస్‌ ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: