
దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు స్థాపించిన తెలుగుదేశానికి ఈ రోజుతో 43 వసంతాలు పూర్తవుతున్నాయి. తెలుగుదేశం స్థాపన తెలుగు రాజకీయాల్లోనే కాదు ఉమ్మడి పశ్చిమగోదావరి రాజకీయాల్లోనూ ఎన్నెన్నో సంచలనాలు నమోదు చేసింది. 1982 మార్చి 29 ఎన్టీఆర్ తెలుగుదేశం స్థాపించారు. ఈ పార్టీతో ఉమ్మడి జిల్లాలో ఎందరెందరో గొప్ప యోధానుయోధులు అయిన రాజకీయ నాయకులు తెలుగు రాజకీయాలకు పరిచయం అయ్యారు. పార్టీ ఆవిర్భావం తర్వాత జరిగిన 1983 ఎన్నికల నుంచి 2024 ఎన్నికల వరకు చాలా ఎన్నికల్లో పార్టీ ఉమ్మడి జిల్లాలో అప్రతిహత విజయంతో చెక్కు చెదరని.. చెరిగిపోని రికార్డులు ఎన్నో బద్దలు కొట్టింది.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో అనేక నియోజకవర్గాలు తెలుగుదేశం పార్టీకి కంచుకోటలుగా ఉంటూ వస్తున్నాయి.
పార్టీ ఆవిర్భావం నుంచి జిల్లాలో చాలా సీట్లు పార్టీకి కంచుకోటలుగా మారాయి. 1983లో జరిగిన ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన టీడీపీ ఉమ్మడి జిల్లాలో ఒక్క చింతలపూడి సీటును మాత్రమే కోల్పోయింది. 1985 ఆచంట సీటు సీపీఎంకు కేటాయించగా ఆ సీటుతో కలిపి క్లీన్‌స్వీప్ చేసింది. 1989లో రాష్ట్రంలో అధికారం కోల్పోయినా జిల్లాలో పట్టు నిలుపుకుంది. 1994 ఎన్నికల్లో అత్తిలి సీటు మినహా ఆచంట సీపీఎం, పెనుగొండ సీపీఐ మిత్రపక్షాలతో కలుపుకుని అన్నీ సీట్లలోనూ ఘనవిజయం సాధించింది. ఆ తర్వాత ఉప ఎన్నికల్లోనూ అత్తిలి సీటు గెలుచుకుంది. ఇక 1999లో ఒక్క కొవ్వూరులో సీనియర్ నేత కృష్ణబాబు ఒక్కరే ఓడిపోగా.. జిల్లాలో అన్ని సీట్లలోనూ దూసుకుపోయింది.
2004లో వైఎస్సార్ ప్రభంజనంలోనూ జిల్లాలో టీడీపీ కొవ్వూరు, ఆచంట, నరసాపురం, పాలకొల్లు సీట్లలో గెలిచి తన పట్టు నిలుపుకుంది. 2009లో ప్రజారాజ్యం, కాంగ్రెస్‌ను ఢీ కొని ఐదు సీట్లలో విజయం సాధించింది. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 2014లో జరిగిన తొలి ఎన్నికల్లో తాడేపల్లిగూడెం సీటు మిత్రపక్షమైన బీజేపీతో కలుపుకుని జిల్లాలో క్లీన్‌స్వీప్ చేసింది. 2019లో ఉండి, పాలకొల్లు సీట్లకే పరిమితమైన టీడీపీ మరోసారి 2014 ఎన్నికల్లో మిత్రపక్షాలు బీజేపీ, జనసేనతో కలిసి వైసీపీకి ఒక్క సీటు ఇవ్వలేదు. ఇలా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అంటేనే తెలుగుదేశం పార్టీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది.