
43 ఏళ్ల తెలుగుదేశం చరిత్రలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో ఎందరో యోధాను యోధులు అయిన రాజకీయ నేతలు ఈ పార్టీలో ఒక వెలుగు వెలిగారు. బీసీ, బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ఎందరో నేతలు ఈ పార్టీలో గొప్ప నాయకులుగా ఎదిగారు. చింతలపూడిలో మాజీ మంత్రి కోటగిరి విధ్యాధరరావు, కొవ్వూరులో పెండ్యాల కృష్ణబాబు, గోపాలపురంలో కారుపాటి వివేకానంద, తణుకులో ముళ్లపూడి ఫ్యామిలీ, పాలకొల్లులో అల్లు వెంకట సత్యనారాయణ, భీమవరంలో పీవి నరసింహారాజు, ఉండిలో కలిదిండి రామచంద్రరాజు, రద్దయిన అత్తిలో దండు శివరామరాజు, నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు, తాడేపల్లిగూడెంలో ఈలి ఆంజనేయులు ఫ్యామిలీ, ఏలూరు జిల్లాలో కలిసిన నూజివీడులో కోటగిరి హనుమంతరావు, దెందులూరులో గారపాటి సాంబశివరావు, ఉంగుటూరులో కంఠమని శ్రీనివాసరావు, కొండ్రెడ్డి విశ్వనాథం ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతి నియోజకవర్గంలోనూ తెలుగుదేశం పేరు చెపితే బలమైన నాయకులు ఉండేవారు.
కాలక్రమంలో పైన చెప్పుకున్న లీడర్లలో కొందరు రాజకీయాలకు దూరంగా ఉంటే .. మరి కొందరు తమ అవకాశ వాద రాజకీయాల కోసం పార్టీలు మారిపోయారు. మరి కొందరు పార్టీ వీడి మళ్లీ తిరిగి వచ్చారు. వీళ్లు బయటకు వెళ్లినా కొత్త కొత్త లీడర్లు పుట్టుకువచ్చి ఉమ్మడి పశ్చిమగోదావరి అంటే తెలుగుదేశానికి ఎప్పటకీ అడ్డానే అని ఫ్రూవ్ చేశారు. దెందులూరులో చింతమనేని ప్రభాకర్‌రావు దెందులూరును పార్టీకి కంచుకోటగా మార్చడంతో పాటు తనదైన దూకుడుతో రాష్ట్రస్థాయిలో బలమైన మాస్ లీడర్‌గా గుర్తింపు తెచ్చుకున్నారు. తణుకులో మరో యువనేత ఆరిమిల్లి రాధాకృష్ణ తణుకు కంచుకోటను బలంగా నిలబెట్టడంతో పాటు చంద్రబాబు, లోకేష్‌కు అత్యంత ఇష్టుడైన నేతగా ఉన్నారు. ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్న ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులు పార్టీకి నమ్మకమైన నేతగా.. చాలా యేళ్ల తర్వాత జిల్లాలో పార్టీని అందరి సహకారంతో సమన్వయం చేసే నేతగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఉమ్మడి పశ్చిమగోదావరిలోని గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రాష్ట్ర కార్యాలయంలో ప్రోగ్రామ్ కమిటీ చైర్మన్‌గా తనదైన ముద్ర వేసి బాబు, లోకేష్ కోర్ టీంలో కీలకనేతగా ఎదిగారు. డెల్టాలో పాలకొల్లులో మంత్రి నిమ్మల రామానాయుడు మరికొన్నేళ్ల పాటు పార్టీ వెనక్కు తిరిగి చూసుకోలేని లీడర్ అయ్యారు. ఏలూరులో బడేటి చంటి తొలిసారి ఎమ్మెల్యే అయినా తనదైన ముద్ర వేసుకుంటున్నారు. గతంలో గోపాలపురం, ఇప్పుడు కొవ్వూరు ఎమ్మెల్యేగా ఉన్న ముప్పిడి వెంకటేశ్వరరావు పార్టీకి నమ్మకమైన నేత అయ్యారు. మరికొన్ని నియోజకవర్గాల్లోనూ ఇతర పార్టీల నుంచి వచ్చిన నేతలు... కొన్ని చోట్ల తొలిసారి ఎమ్మెల్యేలు అయిన వారు... అటు టిక్కెట్లు దక్కనివారు.. రాష్ట్ర స్థాయిలో కార్పొరేషన్ పదవుల్లో ఉన్న వారు కూడా పార్టీలో తమదైన పాత్ర పోషిస్తూ ముందుకు వెళుతున్నారు.