ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆర్థిక పరిస్థితులు దిగజారుతున్న వేళ, ఉచిత పథకాల పేరుతో ప్రజలను ఆకర్షించి అధికారం కోసం మాయమాటలు చెబుతున్న పాలకులపై మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు తీవ్ర విమర్శలు గుప్పించారు. "ఇప్పుడు అన్నీ ఫ్రీ, ఫ్రీ అని ప్రజలను ఓట్ల కోసం ఆకట్టుకుంటున్నారు. ప్రజల డబ్బును ఫ్రీ పేరుతో పంచుతూ, వారి ఫొటోలను వేసుకుంటున్నారు. కానీ అప్పులు అనేవి ఫ్రీగా రావనే వాస్తవాన్ని పాలకులు గుర్తించాలి," అని ఆయన సెటైర్లు వేశారు.


వెంకయ్యనాయుడు మాట్లాడుతూ, నేడు ఏపీ, తెలంగాణలో జీతాలు కూడా చెల్లించలేని దుస్థితికి పాలన చేరుకుందని విమర్శించారు. "ఆర్టీసీ, కార్పోరేషన్ వంటి ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టి అప్పులు తెస్తున్నారు. పరిధికి మించి అప్పులు చేస్తే, ఆ తర్వాత అప్పులు కూడా పుట్టని పరిస్థితి వస్తుంది. రాబోయే రోజుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితులు, వనరులు, ఆదాయం ఏమిటో స్పష్టంగా చెప్పినప్పుడే అప్పులు ఇవ్వాలి. లేదంటే, అడ్డూ అదుపూ లేకుండా ఇష్టం వచ్చినట్లు అప్పులు చేస్తే, తర్వాత వచ్చే ప్రభుత్వం ఏం చేయాలి?" అని ఆయన ప్రశ్నించారు.


పది కాలాల పాటు ఉపయోగపడే నీటి ప్రాజెక్టుల వంటి దీర్ఘకాలిక ప్రాజెక్టులపై దృష్టి పెట్టకుండా, కేవలం అధికారం కోసం "ఇది ఫ్రీ, అది ఫ్రీ" అని ప్రజలను మాయ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. "నీటి ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ఆర్థికంగా ఎదిగారు. కానీ ఇప్పుడు భవిష్యత్ తరాల గురించి ఎంతమంది ఆలోచిస్తున్నారో పాలకులు ఆత్మపరిశీలన చేసుకోవాలి," అని ఆయన సూచించారు.


అంతేకాక, నేడు చిన్న వయసులోనే అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారని, మందులు కూడా కొనలేని దుర్భర పరిస్థితి ఉందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. "అందుకే చదువు, వైద్యం మినహా మరేదీ ఉచితంగా ఇవ్వకూడదనేది నా అభిప్రాయం. ప్రతి ఒక్కరూ చదువుకోవాలి. చదువు ద్వారానే అభివృద్ధి సాధ్యం," అని వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. తాహత్తుకు మించి అప్పులు చేసే విధానం మారాలని, ఏపీ, తెలంగాణలోని పరిస్థితులను గమనించి పాలకులు సరైన దిశగా ఆలోచించాలని ఆయన సూచించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: