తెలంగాణలో గ్రూప్-1 ఉద్యోగాల ఎంపిక ప్రక్రియలో పెద్ద ఎత్తున కుంభకోణం జరిగిందని అశోక్ అకాడమీ చైర్మన్ అశోక్ తీవ్ర ఆరోపణలు చేశారు. 563 గ్రూప్-1 పోస్టులు ఉంటే, 200కు పైగా పోస్టులను బ్యాక్ డోర్ ద్వారా అమ్మేశారని, ఈ వ్యవహారంలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీజీపీఎస్సీ) పూర్తిగా అవినీతిలో మునిగిపోయిందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

అశోక్ మాట్లాడుతూ, "అల్ ఇండియా స్టేట్ టాపర్‌కి 49.5 శాతం మార్కులు వస్తే, ఇక్కడ గ్రూప్-1 మెయిన్స్‌లో 50 శాతం మార్కులు 250 మందికి ఎలా వచ్చాయి? ఇది సాధ్యమేనా? దేశ చరిత్రలో ఎక్కడా ఇన్ని మార్కులు రాలేదు. 50 శాతం పైగా మార్కులు రావడం అంటే, కచ్చితంగా ఎగ్జామ్ బయట వాళ్లతో రాపించారని స్పష్టమవుతోంది," అని విమర్శించారు. ఈ అవకతవకలను బయటపెట్టేందుకు పరీక్ష రాసిన వారి పేపర్లను పబ్లిక్ డొమైన్‌లో ఉంచాలని, ఈ వ్యవహారంపై సీబీఐ ఎంక్వైరీ వేయాలని ఆయన డిమాండ్ చేశారు.

అధికారంలోకి వచ్చిన తర్వాత 57 వేలకు పైగా ఉద్యోగాలు ఇచ్చామని కాంగ్రెస్ ప్రభుత్వం చెబుతున్నది నిజం కాదని అశోక్ ఆరోపించారు. "కాంగ్రెస్ ప్రభుత్వం అధికారికంగా ఇచ్చిన నోటిఫికేషన్లు కేవలం 12 వేలు మాత్రమే. మిగతావి అన్నీ గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఇచ్చిన నోటిఫికేషన్లు. మీరు కేవలం నియామక పత్రాలు మాత్రమే ఇచ్చారు," అని ఆయన వివరించారు. "ఇవాళ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చే ముఖ్యమంత్రి కాదు, నియామకల ముఖ్యమంత్రి. జస్ట్ పత్రాలు మాత్రమే ఇస్తాడు," అని విమర్శించారు.

రేవంత్ రెడ్డి మాటల ద్వారా ముఖ్యమంత్రి అయ్యాడని, ఆ మాటలతోనే పబ్బం గడుపుతున్నాడని అశోక్ వ్యాఖ్యానించారు. "ఆయన కనీసం డిగ్రీ కూడా చదవలేదు. అలాంటి వ్యక్తి దగ్గర విద్యాశాఖ పెట్టుకొని ఏం చేస్తాడు?" అని ప్రశ్నించారు. 15 నెలల కాంగ్రెస్ పాలనలో నిరుద్యోగులకు చేసింది సున్నా అని, ఈ ప్రభుత్వం నిరుద్యోగుల ఆశలను నీరుగార్చిందని ఆయన ఆరోపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: