
ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ మోసాలను బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీలో ఎండగట్టారని, వాస్తవాలను జీర్ణించుకోలేక సీఎం, కాంగ్రెస్ నేతలు బీఆర్ఎస్ నేతలు, సోషల్ మీడియా కార్యకర్తలపై అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. "మార్చి 15న ఒకే రోజు 10 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశారు. ఉదాత్త ఆశయంతో ఏర్పాటు చేసిన సైబర్ సెక్యూరిటీ బ్యూరోను సోషల్ మీడియా కార్యకర్తలపై సుమోటో కేసులు పెట్టేందుకు ఉపయోగిస్తున్నారు," అని ఆయన విమర్శించారు.
సైబర్ పెట్రోలింగ్‌లో కేవలం బీఆర్ఎస్ సోషల్ మీడియా హ్యాండిల్స్‌పైనే దృష్టి పెడుతున్నారని, కాంగ్రెస్, బీజేపీ నేతల హ్యాండిల్స్‌పై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని ఆయన ప్రశ్నించారు. "బీఆర్ఎస్ నేతలు ఫిర్యాదు చేస్తే కేసులు నమోదు చేయడం లేదు, కనీసం రసీదు కూడా ఇవ్వడం లేదు. గాంధీ భవన్‌లో ఎఫ్ఐఆర్‌లు తయారు చేసి వెంటనే నమోదు చేస్తున్నారు," అని ఆరోపించారు.
"సైబర్ పెట్రోలింగ్ సచివాలయంలో చేస్తే అవినీతి ఎక్కడ జరుగుతుందో తెలుస్తుంది. పేదలు, రైతుల దస్త్రాలు ఎక్కడ ఆపుతున్నారో, ఆర్ఆర్ ట్యాక్స్ కడితేనే ఫైల్స్ క్లియర్ అవుతున్నాయని బయటపడుతుంది," అని ఆయన వ్యాఖ్యానించారు. నకిరేకల్ పేపర్ లీకేజీ కేసులో అధికారులు, పోలీసులు నిందితులుగా ఉన్నారని, వాటిని కప్పిపుచ్చేందుకు అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు.
పోలీసు అధికారులు పారదర్శకంగా, నిష్పాక్షికంగా పని చేయాలని, ఎవరికీ భయపడవద్దని ప్రవీణ్ కుమార్ విజ్ఞప్తి చేశారు. "తప్పులు చేస్తున్న కాంగ్రెస్, బీజేపీ నేతలను వదిలిపెడితే ప్రజలు ఊరుకోరు. పారదర్శకంగా పని చేస్తే, బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత పదోన్నతులు, మెడల్స్ ఇస్తాం," అని హామీ ఇచ్చారు. అక్రమ కేసుల ఎఫ్ఐఆర్‌లను బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిశీలించి, ట్రైబ్యునల్ ఏర్పాటు చేసి విచారణ జరిపి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. "కాంగ్రెస్ నేతల దోపిడీలో పోలీసు అధికారులు భాగస్వాములు కావద్దు," అని ఆయన సూచించారు.