
ఈ భూముల్లో చెరువులు, బఫెల్లో లేక్, పికాక్ లేక్ వంటివి ఏవీ లేవని, సర్వేలో ఈ విషయం స్పష్టమైందని వెల్లడించింది. సుస్థిరాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తోందని, తాజా అభివృద్ధి ప్రణాళిక రాళ్లను కాపాడుతుందని పేర్కొంది. అయితే, కొందరు నేతలు విద్యార్థులను తప్పుదోవ పట్టిస్తున్నారని, అటవీ భూమిపై కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నాయని టీజీఐఐసీ ఆరోపించింది.
అయితే, టీజీఐఐసీ ప్రకటనను హెచ్‌సీయూ రిజిస్ట్రార్ తీవ్రంగా ఖండించారు. 2024 జులైలో హెచ్‌సీయూలో ఎలాంటి సర్వే నిర్వహించలేదని, భూమి హద్దులు అంగీకరించినట్లు చెప్పడం అబద్ధమని అన్నారు. ఇప్పటివరకు భూమి సరిహద్దులు గుర్తించలేదని, ఈ విషయంలో ఎలాంటి సమాచారం ఇవ్వలేదని స్పష్టం చేశారు. కేవలం భూమి స్థితిగతులపై ప్రాథమిక పరిశీలన మాత్రమే జరిగిందని తెలిపారు. ఈ భూమిని హెచ్‌సీయూకు కేటాయించాలని చాలా కాలంగా కోరుతున్నామని, ప్రభుత్వం దీన్ని సానుకూలంగా పరిశీలించాలని డిమాండ్ చేశారు.
ఈ భూముల్లో పర్యావరణం, జీవవైవిధ్యాన్ని కాపాడాలని, వర్సిటీ భూముల కేటాయింపుకు ఎగ్జిక్యూటివ్ కమిటీ అనుమతి తప్పనిసరని రిజిస్ట్రార్ ఉద్ఘాటించారు. ఈ వివాదం రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.