
ఐజీ వివరణ ప్రకారం, గత శనివారం రాత్రి 10.30 సమయంలో ఒక జంట బైక్‌పై ఆలయం వద్దకు చేరుకుంది. వారి ప్రవర్తన అనుమానాస్పదంగా కనిపించడంతో నిందితుల్లో నలుగురు గమనించి, తమ సహచరులైన మరో ముగ్గురిని ఫోన్ ద్వారా రప్పించారు. ఆ జంట వివాహితులు కాదని తెలుసుకుని, మహిళతో వచ్చిన వ్యక్తిని కట్టిపడేసి ఆమెపై సామూహిక దౌర్జన్యానికి ఒడిగట్టారు. ఆ తర్వాత బాధితురాలు స్పృహలోకి వచ్చి, తనతో ఉన్న వ్యక్తిని విడిపించింది. ఆదివారం ఉదయం ఇద్దరూ ఆలయం నుంచి భూత్పూర్ మండలంలోని తమ గ్రామానికి బయలుదేరగా, నిందితుల్లో ఒకడైన మహేశ్‌గౌడ్ గమనించి, జరిగిన విషయం బయట చెబితే వారి సంబంధాన్ని బహిర్గతం చేస్తామని హెచ్చరించాడు. భయపడిన బాధితురాలు ఈ ఘటనను దాచి, తెలియని వ్యక్తులు బెదిరించి బంగారం, నగదు దోచుకున్నట్లు ఊర్కొండ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.
పోలీసులు వెంటనే ఆలయానికి చేరుకుని సీసీ కెమెరా ఫుటేజ్‌ను పరిశీలించగా, ఆలయ కాంట్రాక్ట్ కార్మికుడు మహేశ్‌గౌడ్ బాధితురాలిని బెదిరిస్తున్న దృశ్యాలు కనిపించాయి. ఎస్సై కృష్ణదేవ అప్రమత్తమై ఈ విషయాన్ని ఎస్పీకి తెలియజేసి, మహేశ్‌గౌడ్‌ను ప్రశ్నించారు. దీంతో ఊర్కొండపేటకు చెందిన సాధిక్‌బాబా, హరీశ్‌గౌడ్, మణికంఠగౌడ్, మారుపాకుల ఆంజనేయులుగౌడ్, మట్ట ఆంజనేయులుగౌడ్, కల్వకుర్తి మండలం ఎల్లికట్ట గ్రామానికి చెందిన కార్తిక్‌లు ఈ దుష్కృత్యంలో భాగస్వాములని నిర్ధారణ అయింది. ఈ కేసులో సాక్ష్యాలను ఫాస్ట్‌ట్రాక్ కోర్టు, హైకోర్టుకు అందజేసి, నిందితులకు త్వరగా కఠిన శిక్ష పడేలా చర్యలు చేపడతామని ఐజీ స్పష్టం చేశారు.