టీజీపీఎస్సీ గ్రూప్-1 మెయిన్స్‌లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయా? ప్రతి పోస్టుకు నిర్ణీత మొత్తం తీసుకున్నారా? కొందరు ఎంపిక చేసిన అభ్యర్థులను ఒకే గదిలో ఉంచి పరీక్షలు రాయించారా? తమకు అనుకూలమైన వారికి ఇష్టమొచ్చినట్లు మార్కులు కట్టబెట్టారా? ఫలితాలను గమనిస్తే అలాంటి అనుమానాలు కలుగుతున్నాయి. గ్రూప్-1 జనరల్ ర్యాంకింగ్ జాబితా (జీఆర్‌ఎల్)ను పరిశీలిస్తే బహుళ అవకతవకలు బయటపడుతున్నాయి. ఈ పరీక్షలో టాపర్లంతా ఒకే గదిలో కూర్చొని రాసినట్లు తెలుస్తోంది. 500కు పైగా మార్కులు సాధించిన వారంతా ఒకే గదిలో పరీక్ష రాసినట్లు స్పష్టమవుతోంది.



మెరిట్ మార్కులు, హాల్‌టికెట్ నంబర్లను పరిగణనలోకి తీసుకుంటే, ఒకే గదిలో రాసిన వారికి ఒకటి లేదా రెండు మార్కుల తేడాతో ఫలితాలు ఉండటం ఆశ్చర్యం కలిగిస్తున్నది. టాప్ ర్యాంకులు సాధించిన ముగ్గురు అభ్యర్థులు ఒకే గదిలో పరీక్ష రాసినట్లు ఇతర పోటీదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక నిర్దిష్ట ప్రణాళిక ప్రకారం జరిగినట్లు కనిపిస్తుందని, గ్రూప్-1లో భారీ అక్రమం జరిగిందని అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటన వెనుక ప్రభుత్వ ఉన్నతాధికారుల పాత్ర ఉందని, ఈ అవకతవకలపై న్యాయ విచారణ జరపాలని చాలామంది అభ్యర్థులు కోరుతున్నారు.


టీజీపీఎస్సీ విడుదల చేసిన గ్రూప్-1 జీఆర్‌ఎల్‌ను పరిశీలిస్తే, మార్కులు వరుసగా కేటాయించినట్లు అనుమానం కలుగుతున్నది. ప్రతి రెండు హాల్‌టికెట్ నంబర్లకు ఒకే మార్కులు కనిపిస్తున్నాయి. రెండు హాల్‌టికెట్ నంబర్ల వ్యత్యాసంతో 44 మందికి ఒకే స్థాయి మార్కులు రావడం గమనించదగిన విషయం. ఈ వారంతా మెరిట్ జాబితాలో చోటు దక్కించుకున్నారు. ఎన్ని విధాలుగా విశ్లేషించినా ఇలాంటి ఫలితాలు రావడం సాధ్యం కాదు. అయినప్పటికీ, ఇదంతా ఒక వ్యవస్థీకృత పద్ధతిలో జరిగినట్లు తెలుస్తోంది. 370 మార్కుల వరకు సాధిస్తే గ్రూప్-1 ఉద్యోగాలు దక్కుతాయని అంచనా ఉంది. కొందరిని ఉద్దేశపూర్వకంగా ఎంపిక చేసి, పరీక్ష పత్రాలను సరిగా మూల్యాంకనం చేయకుండా, ఇష్టానుసారంగా మార్కులు కేటాయించి పోస్టులు ఇచ్చే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వస్తున్నాయి.


ఒక పరీక్ష కేంద్రంలో హాల్‌టికెట్ నంబర్ 366 ఉన్న అభ్యర్థికి 436 మార్కులు, ఆ తర్వాతి నంబర్ 367 ఉన్న వ్యక్తికి 438 మార్కులు వచ్చాయి. వేరే చోట 732 నంబర్ ఉన్న అభ్యర్థికి 425 మార్కులు, 733 నంబర్‌కు 425.5 మార్కులు రాగా, ఇలా వరుసగా ఉన్న హాల్‌టికెట్ నంబర్లకు 0.5 మార్కుల తేడాతో ఫలితాలు కనిపిస్తున్నాయి. వరుస హాల్‌టికెట్ నంబర్లు, వరుసగా కేటాయించిన మార్కులు ఉండటం ఆశ్చర్యకరం.


ముందు బెంచ్‌లో కూర్చున్న వారికి వచ్చిన మార్కులతో పోలిస్తే, వెనుక బెంచ్‌లో ఉన్నవారికి ఒకటి లేదా రెండు మార్కుల వ్యత్యాసం ఉంది. ఇదంతా గమనిస్తే, గ్రూప్-1 మెయిన్స్ పత్రాలను నిజంగా మూల్యాంకనం చేశారా లేక వరుసగా మార్కులు కేటాయించారా అనే సందేహం కలుగుతున్నది. హాల్‌టికెట్ నంబర్ల ఆధారంగా సగటున మార్కులు వేసినట్లు అనిపిస్తున్నది. ఈ ఉదాహరణ గ్రూప్-1 మెయిన్స్ మూల్యాంకనంలో ఎంతటి లోపాలు జరిగాయో చూపిస్తున్నది. ఒకరిద్దరు కాకుండా సుమారు 360 మంది అభ్యర్థుల విషయంలో ఇలాంటి పరిస్థితి నెలకొంది.



మరింత సమాచారం తెలుసుకోండి: