తెలంగాణ గ్రూప్-1 పరీక్షల ఫలితాల్లో అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ఇది టీజీపీఎస్సీ విశ్వసనీయతను తీవ్రంగా ప్రశ్నిస్తోంది. కోఠి మహిళాకళాశాలలోని  రెండు కేంద్రాల నుంచి 88 మంది 450కి పైగా మార్కులు సాధించారు. మిగతా 24 కేంద్రాల నుంచి కలిపినా 80 మంది కూడా లేరు. ఇలాంటి లెక్కలు అసమానతలు విపరీతంగా కనిపిస్తున్నాయి. అంతేకాదు, 373 మంది రాష్ట్ర టాపర్లు ఒకే సెంటర్‌లో గుంపులుగా, పక్కపక్కన లేదా సమీప గదుల్లో కూర్చుని రాయడం, 100కి పైగా జంట ర్యాంకర్లు పక్కపక్కనే ఉండటం అనుమానాలను రేకెత్తిస్తోంది.


ఇంగ్లీష్, మొత్తం స్కోర్లలో కేంద్రాల వారీగా ఒకే ధోరణి కనిపించడం, 2,740 మందికి (1,370 జంటలు) 0 నుంచి 0.5% తేడాతో సమాన మార్కులు రావడం వంటివి అంకెల గారడీని సూచిస్తున్నాయి. తెలుగు మీడియం అభ్యర్థుల దుస్థితి మరింత ఆందోళనకరంగా ఉంది.  7,500 మంది హాజరైనా, టాప్ 500లో 20 మంది కూడా లేరు, ఇది వారికి జరిగిన అన్యాయాన్ని తెలియజేస్తుంది.


ఇక ఉర్దూ మీడియం ఫలితాలపైనా అనుమానాలు తలెత్తుతున్నాయి. కేవలం 9 మందే ఈ మీడియంలో రాస్తే  వారిలో 4 మంది సెలెక్ట్ కావడం, ఎటువంటి కోచింగ్ లేకుండా 18వ ర్యాంకు సాధించడం విశేషం. ఇది నిజమైన ప్రతిభనా లేక కృత్రిమ విజయమా అనే సందేహాలు కలుగుతున్నాయి.


అయితే, యూపీఎస్సీలో 50% మార్కులతో ఐఏఎస్ రాగలిగితే, టీజీపీఎస్సీలో అదే స్కోరుతో ఎంపీడీవో కూడా రాదన్న వాస్తవం వివక్షను బహిర్గతం చేస్తోంది. జీఆర్ఎల్ విడుదలలో మీడియం వివరాలు లేకపోవడం ఈ అక్రమాలను మరింత గాఢం చేస్తోంది. దీని వెనుక ఉద్దేశం ఏమిటన్నది స్పష్టంగా తెలియడం లేదు. ఈ పరిణామాలు పరీక్షా వ్యవస్థలో పారదర్శకత, న్యాయం లోపించాయని సూచిస్తున్నాయి. యువత ఆకాంక్షలతో పోటీపడే ఈ పరీక్షల్లో ఇటువంటి అవకతవకలు వారి విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి. ప్రభుత్వం తక్షణం జ్యుడిషియల్ విచారణ ఆదేశించి, ఆన్సర్ షీట్లను బహిర్గతం చేయాలి. లేకపోతే, ఈ వివాదం రాజకీయంగా, సామాజికంగా పెను సవాలుగా మారే ప్రమాదం ఉంది.



మరింత సమాచారం తెలుసుకోండి: