
వైసీపీ హయాంలో ఎమ్మెల్యే దారి ఎమ్మెల్యేది.. అయితే ఎంపీ దారి ఎంపీది అన్నట్టుగా రాజకీయాలు నడిచాయి. అస్సలు ఎంపీలకు వైసీపీ ప్రభుత్వంలో విలువ లేకుండా పోయింది. ఎంపీలను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎంపీలపై చిన్న ఫిర్యాదులు వస్తే మీరు ఎమ్మెల్యే విధుల్లో జోక్యం చేసుకోవద్దు.. ఎమ్మెల్యేలకు చెప్పకుండా నియోజకవర్గాల్లోకి వెళ్లవద్దనే చెప్పేవారు. అయితే ఇప్పుడు కూటమి ప్రభుత్వం లో మాత్రం ఎమ్మెల్యేలు.. ఎంపీలు ఒకరి వ్యవహారాల్లో ఒకరు వేలు పెడుతున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. ఇది పార్టీలకు.. ప్రభుత్వానికి కూడా తలనొప్పిగా మారినట్టు అంతర్గతంగా చర్చ నడుస్తోంది.
చాలా జిల్లాల్లో ఇదే పరిస్థితి కనిపిస్తుండడం గమనార్హం. అనకాపల్లి జిల్లాలో ఎంపీ సీఎం రమేష్‌కు.. బీజేపీ నాయకులకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఉందట. రమేష్ ఒంటెద్దు పోకడలను అక్కడ ఎవ్వరూ సహించ లేకపోతున్నారు. అలాగే బాపట్ల ఎమ్మెల్యేకు.. ఎంపీకి మధ్య కూడా ఇబ్బందికర వాతావరణమే ఉందంటున్నారు. స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే వేగేశ్న నరేంద్ర వర్మ నిత్యం ప్రజా సంక్షేమ కార్యక్రమాలతో పాటు ప్రజల మధ్యలో దూసుకు పోతున్నా ఎంపీ తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఎమ్మెల్యేతో సఖ్యతతో వ్యవహరించడం లేదని లోకల్ టీడీపీ నాయకుల టాక్ ?
గుంటూరు ఎంపీగా ఉన్న కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వ్యవహారంపైనా టీడీపీ ఎమ్మెల్యేలు బాగా గుర్రుగా ఉన్నారట. ఆయన ఎవ్వరికి చెప్పకుండా తన కార్యక్రమాలకు రావడం .. వెళ్లడం.. తో ఇటీవల ఇద్దరు ఎమ్మెల్యేలు ఆయన కార్యక్రమాలకు డుమ్మా కొట్టడంతో పాటు చంద్రబాబు వద్ద ఇదే విషయాన్ని ప్రస్తావించారని అంటున్నారు. ఇలా ఏపీలో ఇప్పుడు ఎంపీలు వర్సెస్ ఎమ్మెల్యే మధ్య కోల్డ్ వార్ అయితే నడుస్తోంది. చంద్రబాబు దీనిని సరి దిద్దక పోతే అటు ప్రభుత్వం తో పాటు ఇటు పార్టీకి పెద్ద చిక్కులు .. తలనొప్పులు అయితే తప్పవు.