ఉమ్మ‌డి అనంత‌పురం జిల్లాలోని కీల‌క‌మైన నియోజ‌క‌వర్గం క‌దిరిలో టీడీపీ దూకుడు ముందు.. వైసీపీ నిలువ‌లేక‌పోతోంది. గ‌త ఎన్నికల్లో టీడీపీ ఇక్క‌డ విజ‌యం ద‌క్కించుకుంది. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. కందికుంట వెంక‌ట ప్ర‌సాద్ గెలుపు గుర్రంఎక్కారు. దీంతో టీడీపీని బ‌లోపేతం చేయ‌డంతోపాటు.. వైసీపీ నేత‌ల‌కు చుక్క‌లు చూపిస్తున్నారు. గ‌త వైసీపీ హ‌యాంలో అక్ర‌మాలు, అన్యాయాల‌కు పాల్పడిన వారిపై చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. అంతేకాదు.. స్థానికంగా కూడా.. వైసీపీ నేత‌ల ఆగ‌డాల‌పై ప్ర‌త్యేక దృష్టి పెట్టారు.


ఇదిలావుంటే..క‌దిరి మునిసిపాలిటీని కూట‌మి ప‌రం చేసే క్ర‌మంలో ఎమ్మెల్యే కీల‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్నా రు. 2021-22 మ‌ధ్య జ‌రిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల్లో క‌దిరిలో  వైసీపీ విజ‌యం ద‌క్కించుకుంది. అయితే.. అప్ప‌ట్లో త‌మ వారిని క‌నీసం నామినేష‌న్ వేసేందుకు కూడా అవ‌కాశం క‌ల్పించ‌లేద‌న్న కందికుంట‌.. తాజాగా.. వైసీపీ నుంచి వ‌చ్చే వారికి ఆహ్వానం ప‌లుకుతున్నారు. ఇలా.. ఇప్ప‌టి వ‌ర‌కు 14 మంది వ‌ర‌కు వైసీపీ కౌన్సిల‌ర్లు.. టీడీపీ గూటికి చేరారు.


దీంతో టీడీపీకి బ‌లం పెర‌గ్గా.. వైసీపీకి త‌గ్గుతూ వ‌చ్చింది. ఈ నేప‌థ్యంలో తాజాగా మునిసిప‌ల్ చైర్మ‌న్‌.. వైస్ చైర్మ‌న్ల‌పై అవ‌శ్వాసం ప్ర‌క‌టించారు. ఈ నెల 23న నిర్వ‌హించ‌నున్న కౌన్సిల్ స‌మావేశంలో వీరిద్ద‌రికి సం బంధించి విశ్వాస ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. కాగా.. ఇప్ప‌టికే 14మంది వైసీపీ నాయ‌కులు.. ఈ అవిశ్వాస చ‌ర్చ‌కు అనుకూలంగా తీసుకున్న నిర్ణ‌యంపై సంత‌కాలు చేశారు. ఇది వైసీపీకి శ‌రాఘాతంగా మారింది.  త‌మ వారిని కాపాడుకునేందుకు వైసీపీ నాయ‌కులు చేస్తున్న ప్ర‌య‌త్నాలు కూడా విఫ‌ల‌మ‌వుతున్నాయి.


పైగా వైసీపీ నాయ‌కుల మ‌ధ్య అంత‌ర్గ‌త క‌ల‌హాల కార‌ణంగా కూడా.. ఎవ‌రూ పెద్ద‌గా ఈ విష‌యాన్ని సీరియ స్‌గా తీసుకోవ‌డం లేదు. ఎందుకంటే.. ఎవ‌రికీ రాజ‌కీయంగా క‌లివిడి లేక‌పోవ‌డం.. వైసీపీకి మరింత మైన‌స్ అయిపోయింది. మ‌రోవైపు.. 23వ తేదీన అవిశ్వాసంపై చ‌ర్చ జ‌ర‌గ‌నుంది. దీనిలో క‌నుక వైసీపీ స‌భ్యులు అనుకూలంగా ఓటేయ‌క‌పోతే.. అప్పుడు ఖ‌చ్చితంగా పార్టీకి తీవ్ర న‌ష్టం జ‌రుగుతుంది. ఇదిలావుంటే.. వైసీపీ నుంచి మ‌రింత మంది కౌన్సిల‌ర్ల‌ను త‌మవైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నాలు మ‌రింత ముమ్మ‌ర‌మ‌య్యాయి. మ‌రం ఏం జ‌రుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: