తెలంగాణాతో పాటుగా దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల చదును వ్యవహారంలో బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలు, సోషల్ మీడియా పోస్ట్ లపై కాంగ్రెస్ స్ట్రాంగ్ కౌంటర్ ఇస్తోంది. గత పదేళ్ళ కాలంలో జరిగిన పలు వ్యవహారాలను బయటకు తీస్తూ సమాధానాలు చెప్పాలని సవాల్ చేస్తోంది. పదేళ్ళ గులాబీ పార్టీ పాలనలో పెద్ద ఎత్తున అటవీ భూములను నాశనం చేసి.. లక్షలాది చెట్లను నరకడమే కాకుండా లక్షల కొద్దీ మూగ జీవాలకు నిలువ నీడ లేకుండా చేసిన చరిత్ర ఎలా మర్చిపోతారు అంటూ మండిపడుతోంది . 2014 నుంచి 2023 వరకు కెసిఆర్ సర్కార్ హయాంలో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న హరిత హారం కార్యక్రమం పేరుతో అటవీ భూములను పెంచడం కంటే.. విస్తీర్ణం తగ్గించారు అంటూ మండిపడుతోంది కాంగ్రెస్. 


హరిత హారం కార్యక్రమంలో భాగంగా మొత్తం ఏడేళ్ళలో 2015 నుండి 2022 వరకు అప్పటి ప్రభుత్వం 219 కోట్ల మొక్కలు నాటినట్టు ప్రకటించింది. ఇక దీని కోసం 9,777 కోట్ల రూపాయలు వెచ్చించారు. గ్రామీణాభివృద్ధి శాఖ నుంచి 5,006.82 కోట్లు, అటవీ శాఖ నుంచి 2,567.12 కోట్లు కేటాయించారు. అప్పుడు నాటిన మొక్కలలో 85 శాతం బతికాయని స్వయంగా కెసిఆర్ ముఖ్యమంత్రి హోదాలో ప్రకటన చేసారు. మరి కెసిఆర్ ప్రకటన నిజమైతే  తెలంగాణలో అటవీ భూముల విస్తీర్ణం 2014లో 21,591 చ.కి.మీ ఉండగా.. అక్కడి నుంచి 2021 నాటికి 21,213 చ.కి.మీకి ఎందుకు తగ్గిందని నిలదీస్తోంది. ఇక 2014 నుంచి 2024 మధ్య, కెసిఆర్ సర్కార్ పాలనలో 11,422.47 హెక్టార్ల అటవీ భూమిని అధికారికంగా, అటవీయేతర ప్రయోజనాల కోసం అప్పుడు కేటాయించారు.
 

ఇప్పుడు నిరుపయోగంగా ఉన్న కాళేశ్వరం ప్రాజెక్ట్ కోసం కూడా పెద్ద ఎత్తున అటవీ భూములను నాశనం చేసింది అప్పటి బీఆర్ఎస్ సర్కార్ అంటూ కాంగ్రెస్ మండిపడుతోంది. అటవీ సంరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి 2016 నుంచి 2019 మధ్య కాలంలోనే ఈ ప్రాజెక్ట్ కోసం 12,12,753 చెట్లను నరికారు. 8,000 ఎకరాల్లో అడవిని నరికారని లెక్కలు బయటపెడుతోంది. ఇంత జరిగినా.. అప్పుడు పర్యావరణ ప్రేమికులు ఎందుకు మౌనంగా ఉండాల్సి వచ్చిందని కాంగ్రెస్ లెక్కలతో కౌంటర్లు ఇస్తోంది. 2014 నుంచి 2023 మధ్య కాలంలో 4,28,437 ఎకరాల భూమిని బీఆర్‌ఎస్ ప్రభుత్వం విక్రయించగా ఎక్కువగా ఈ భూముల్లో అటవీ భూములే ఉన్నాయని మండిపడుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: