
ఎమ్మెల్యేలు అంటే.. ప్రజల కోసం పోరాటంచేస్తూ.. ప్రజల సమస్యలను పరిష్కరించే వారిగా పేరు తెచ్చు కోవాలి. కానీ, ప్రజలను వీరు వదిలేశారని.. అసలు ప్రజల ముఖం చూసిన వారు కూడా.. ఈ 71 మంది పట్టుమని 10 మంది కూడా లేరన్నది సదరు సంస్థ చెప్పిన వాస్తవం. అంతేకాదు.. వ్యక్తిగత వ్యవహారాలు.. కబ్జాలు, ప్రైవేటు సెటిల్ మెంట్లు, ఇసుక, మద్యం, వ్యాపారుల నుంచి కమీషన్లు ఇలా అనేక రంగాల్లో వారు ఆరిపోతున్నారని చెబుతున్నారు.
ఒకరకంగా.. ఇది పూర్వ 2014-19 మధ్య సాగించిన వ్యవహారంగానే ఉందన్నది సదరు సంస్థ చెప్పిన విషయం. ఒకవైపు సూపర్ సిక్స్ అమలు కోసం ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తోంది. దీనిపై పెద్ద ఎత్తున చర్చకు రాకుండా ఉండేందుకు ప్రయత్నాలు సాగుతున్నాయి. ఇలాంటి సమయంలో సర్కారుకు చేయూతగా.. నాయకులు ప్రజల మధ్యకు వెళ్లి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను వివరించాల్సి ఉంది. కానీ, 71 మంది లో కేవలం 10 మంది లోపే.. ప్రజల మధ్యకు రెండునుంచి మూడు సార్లు వెళ్లారని సర్వే చెప్పింది.
ఇక, ఒకే ఒక్కసారి ప్రజల మధ్యకు వెళ్లిన వారు 20 మంది మాత్రమే ఉన్నారు. అసలు ప్రజల మధ్యకు వెళ్లకుండానే కాలం గడిపేసిన వారు. 50 మంది వరకు ఉన్నారని సర్వే తేల్చేసింది. దీంతో ప్రజల్లో ఆయా ఎమ్మెల్యేలపై తీవ్ర వ్యతిరేకత పెరుగుతున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఈ జాబితాలో ఒక్క టీడీపీ మాత్రమే కాదు.. జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారని.. కూడా సర్వే చెప్పడం గమనార్హం. దీనిని బట్టి భవిష్యత్తులో మార్పులు చేయకుండా.. కూటమికి ఎదురు దెబ్బ తప్పదని అంటున్నారు.