
అయినా.. కూడా వాసంశెట్టిలో మార్పు రాకపోగా.. మరోసారి విజృంభించే ప్రయత్నం చేయడం గమనార్హం. కరుణాకర్ రెడ్డీ గుర్తు పెట్టుకో.. నీ తాట తీస్తా. నీ ఇంటికొస్తా` అంటూ మంత్రి వాసంశెట్టి వ్యాఖ్యానించారు. తిరుమలకు చెందిన గోశాలలో గోవులు మరణించాయంటూ.. భూమన కరుణాకర్‌రెడ్డి గత రెండు రోజులుగా మీడియా ముందు వ్యాఖ్యలు చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై అటు టీటీడీ అధికారులు.. ఇటు టీడీపీ నాయకులు మంత్రులు కూడా స్పందిస్తున్నారు. కానీ, విషయాన్ని ఎక్కడా డైవర్ట్ కాకుండా చూసుకుంటున్నారు. కానీ, తాజాగా వాసంశెట్టి సుభాష్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
భూమన వ్యవహారశైలి, ఆరోపణలపై మంత్రి నిప్పులు చెరుగుతూ.. `` భూమనా.. నీ నోటి దురద తగ్గించుకో. లేకపోతే.. నీ ఇంటికే వస్తా. ఈ ఫ్యామిలీ ముం దే.. తాటతీస్తా జాగ్రత్త. హిందూ ఆలయాలపై విమర్శలు చేస్తావా? మత్తులో ఉన్నావా? ఒళ్లు దగ్గర పెట్టుకో. నువ్వు కరోనా కంటే క్రూరుడివి`` అని వాసంశెట్టి రెచ్చిపోయారు. గతంలో టీటీడీ బోర్డు చైర్మన్‌గా పనిచేసిన సమయం లో భూమన అవినీతికి పాల్పడ్డాడని వాసంశెట్టి దుయ్యబట్టారు. అయితే.. ఈవ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. మంత్రిగా ఉండి.. ఇలాంటి వ్యాఖ్యలు ఏంటి? అంటూ.. టీడీపీ నాయకులే ప్రశ్నించే పరిస్థితి వచ్చింది.
మరోవైపు.. మంత్రి వాసంశెట్టి వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో టీడీపీ నాయకులు దిద్దుబాటు చర్యలకు దిగారు. పార్టీ రాష్ట్ర చీఫ్ పల్లా శ్రీనివాసరావు.. ఈ వ్యాఖ్యలు వాసంశెట్టి వ్యక్తిగతమని పేర్కొన్నారు. ఇక, ముఖ్యమంత్రి కార్యాలయం కూడా.. ఈ వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు పరిశీలిస్తున్నట్టు పేర్కొనడం గమనార్హం. ఇక, సీనియర్ నాయకులు కూడా.. ఏదైనా ఉంటే వ్యక్తిగతంగా కాదని.. రాజకీయంగానే స్పందించాలని.. లేకపోతే వైసీపీకి, మనకు తేడా ఏంటని ప్రశ్నించారు. ఇలా వరుస పెట్టి వాసంశెట్టి వివాదాలకు కేంద్రంగా మారడంతో టీడీపీకి పెద్ద ఇబ్బందే ఏర్పడుతోందని అంటున్నారు. మరి చంద్రబాబు ఎలాంటి నిర్నయం తీసుకుంటారో చూడాలి.