ప్రపంచం మొత్తం మీద అమెరికా, బ్రిటన్ దేశాల్లో ప్రజల్లో స్వార్దం ఎక్కువట. అంటే 'నేను పైకి రావాలి, నేను ఎదగాలి. ఎవ్వరి మీద ఆధారపడ రాదు' అన్న ఆలోచనే 'నేను'కు దారితీస్తుందట. జపాన్ ప్రజల్లో మాత్రం 'మనం' అనే గుణం ఉందట. 'మనం ప్రగతిని సాధించాలి.
మనం పైకి రావాలి. కలివిడిగా సాధించాలి. అందుకు పరస్పరం సహకారం అవసరం' అని వారు భావిస్తారట. తోటి వారిని ఇబ్బంది పెట్టని ప్రవర్తన మనలో కూడా పెరగాలంటే దేశ, విదేశాలు తిరుగుతూ భిన్న సమాజాల ప్రజలను కలుసుకోవాలని పరిశోధకులు చెబుతున్నారు.
రోజువారి డ్యూటీలకు ఏడాదిలో నెల రోజులైనా బ్రేక్ ఇచ్చి, అరుదైన ఆహ్లాదకర పర్యాటక ప్రాంతాలకు, అద్భుత జలపాతాలను, పచ్చని కొండలు,లోయలు వైపు వెళితే మనసు ఉల్లాసంగా ఉంటుందని మానసిక నిపుణులు అంటున్నారు. సమాజం పట్ల మన ఆలోచనలో మార్పు రావాలంటే, కొంతకాలం ఇతర పర్యాటకులతో కలిసిపోవడం, అక్కడి స్థానికులతో కలిసి తిరగడం అవసరం అంటున్నారు.
విమానాల్లో తిరుగుతూ, హోటళ్లలో గడపడం కంటే రైళ్లలోనో, సొంత వాహనాల్లోనో తిరుగుతూ స్థానిక ప్రజలను కలుసుకునే చోట బస చేయాలట. ముఖ్యంగా పర్యావరణాన్ని, మానవ హక్కులను గౌరవించే ప్రాంతాల్లో తిరగడం మంచిదని సామాజిక విశ్లేషకుల సూచన.