ప్రభుత్వం చేయాల్సిన పని ప్రభుత్వం చేస్తుందని ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వై ఎస్ జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారు..ప్రయివేటు సంస్థలు చేయాల్సిన పనులు వాళ్లు చేయాలన్నారు. బుధవారం స్కూళ్లను అభివృద్ధి చేయడంపై సీఎం వైయస్.జగన్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ప్రభుత్వ స్కూళ్లు, కాలేజీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఇంత పెద్ద ఎత్తున చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్రయివేటు కాలేజీలు, స్కూళ్లలో కూడా సరైన సదుపాయాలు ఉండాలని చెప్పారు. ప్రయివేటు కాలేజీలకు అనుమతి ఇవ్వడం లేదన్నది అవాస్తవమన్నారు. కాకపోతే అక్కడ సరైన మౌలిక సదుపాయాలు, ఉన్నాయా? లేదా? అన్నది చూస్తున్నామని చెప్పారు. అలా ఉన్నప్పుడు ఎవ్వరికీ అభ్యంతరం ఉండదన్నారు. కనీస ప్రమాణాలు, వసతులు లేకుండా ఏ విద్యా సంస్థ అయినా ఉండడం సరికాదని చెప్పారు. వాస్తవానికి ప్రతి మండలానికీ జూనియర్ కాలేజీ ఉండాలన్నది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. ఆమేరకు భవిష్యత్ కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రస్తుతం ఉన్న హైస్కూళ్లను క్రమపద్ధతిలో ప్లస్ టూ వరకూ పెంచాలన్న సీఎం సూచించారు. జూనియర్ కాలేజీ స్థాయికి వీటిని తీసుకువెళ్లాలని చెప్పారు.
ఎక్కడెక్కడ చేయాలి, ఎలా చేయాలి, ఏ రకంగా చేయాలి, ఏ ప్రాంతాల్లో చేయాలన్నదానిపై ఒక ప్లాన్ సిద్ధం చేయాలని సీఎం జగన్ కోరారు. ప్రస్తుతం ప్రతి నియోజకవర్గానికి ఒక కాలేజీ చొప్పున బాగుచేయడంపై ప్రణాళికలను రూపొందించాలని చెప్పారు. స్కూళ్ల తరహాలోనే కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేయాలన్నారు. నాడు– నేడు కింద 44,512 పాఠశాలలను బాగుచేయనున్నారు. మొదటి విడతలో 15410 స్కూళ్లలో నాడు – నేడు కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. పాఠశాలల్లో 9 రకాల కనీస వసతులను ప్రభుత్వం కల్పించనున్నదని చెప్పారు. పంచాయతీరాజ్, మున్సిపల్, ట్రైబల్, సోషల్, బీసీ వెల్ఫేర్ ఇలా అన్ని శాఖలకు చెందిన స్కూళ్లు కూడా ప్రతి దశలో ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు.
తొలిదశలో టార్గెట్ పెరిగినా పర్వాలేదని సీఎం అధికారులకు భరోసా కల్పించారు. ఏ స్కూల్ తీసుకున్నా 9 రకాల పనులు తప్పనిసరిగా పూర్తికావాలన్నారు. చేపట్టే పనుల్లో నాణ్యత ఉండాలని, దాంట్లో రాజీపడవద్దని స్పష్టం చేశారు. మార్చి 14, 2020 నాటికి నాడు–నేడు కింద తొలిదశ స్కూళ్లలో చేపట్టిన పనులు పూర్తి చేస్తామని అధికారులు వివరించారు. స్కూళ్లలో చేపడుతున్న పనులకు విద్యా కమిటీల రాటిఫికేషన్ ఉండేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. విద్యా కమిటీలు సామాజిక తనిఖీ చేయాలని సీఎం సూచించారు.
స్కూళ్ల బాగుకోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను తల్లిదండ్రులు ప్రశంసిస్తున్నారంటూ సీఎం దృష్టికి తీసుకు వచ్చిన అధికారులు
బడుల బాధ్యత విద్యార్థుల తల్లిదండ్రులదే అన్న భావన కలిగించాలన్నారు. స్కూళ్లను అభివృద్ధిచేయడంలో పూర్వ విద్యార్థుల సహకారం తీసుకోవాలన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ఈ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేలా ,వచ్చే ఏడాది నుంచి 1 నుంచి 8 వ తరగతి వరకూ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన, దాని తర్వాత 9, 10 తరగతులకూ ఇంగ్లీష్ మాధ్యమంలో బోధన ఉండాలన్నారు. 70వేలమంది టీచర్లకు ఇంగ్లీష్ బోధనలో శిక్షణ ఉండాలని చెప్పారు. డైట్స్‌లో ఇంగ్లీష్ బోధనపై శిక్షణ ఇచ్చేలా, డైట్స్‌ను బలోపేతం చేసే విధంగా ఆలోచన చేయాలన్నారు.
టీచర్లకు ఇచ్చిన శిక్షణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పారు.
విద్యార్థుల సంఖ్యకు తగినట్టుగా టీచర్లను ఉంచడానికి కసరత్తు చేస్తున్నామన్నారు. ఖాళీల భర్తీ పక్రియను ప్రతి ఏడాది జనవరిలో పూర్తిచేయాలన్నారు. ఏ శాఖ ఏ పరీక్షలు పెట్టాలన్నా జనవరిలో పెట్టాలని సీఎం సూచించారు. పర్యావరణం, క్లైమేట్ ఛేంజ్, రహదారి భద్రతపై పాఠ్యాంశాలు ఉంచాలన్నారు. పుస్తకాలు, యూనిఫారమ్స్, షూ, స్కూలు బ్యాగు ఇవన్నీకూడా వచ్చే ఏడాది స్కూల్లో చేరిన రోజే ఇవ్వాలని చెప్పారు. ఎక్కడా ఆలస్యం కాకుండా ప్రణాళిక ఉండాలని అధికారులను ఆదేశించారు. మధ్యాహ్న భోజనం కింద ఇస్తున్న కోడిగుడ్ల నుంచి గతంలో బాగా నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చిందని అధికారులు తెలిపారు. అందుకే ప్రభుత్వం వచ్చాక గుడ్ల పంపిణీని వికేంద్రీకరించామన్నారు. నాణ్యమైన గుడ్లు విద్యార్థులకు అందేలా ఇంకా ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై మరిన్ని ఆలోచనలు చేయాలన్నారు.అన్ ఇన్‌కంబర్డ్ బ్యాంకు ఖాతాలను తెరిచే బాధ్యత గ్రామ వాలంటీర్లదేనాని స్పష్టం చేశారు.