వైఎస్ జగన్ అధికారం చేపట్టిన నాటి నుంచి నిరుద్యోగులకు పండుగలానే మారింది. కేవలం మూడు నెలల్లోనే ఆయన లక్షల సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి శ్రీకారం చుట్టారు. గ్రామ సచివాలయ భావనతో లక్షల కొద్దీ ఉద్యోగాలు సృష్టించారు. ఆ తర్వాత కూడా అడపా దడపా కొత్త పోస్టుల గురించి మాట్లాడుతూనే ఉన్నారు.
తాజాగా ఏపీలో మరో ఉద్యోగాల భర్తీ ప్రస్తావన వచ్చింది. రాష్ట్రంలో 39 మంది ఉద్యానవన శాఖ అధికారుల పోస్టులను భర్తీ చేయాలని జగన్ ప్రభుత్వం భావిస్తోందట. ఈ మేరకు మంత్రి కన్నబాబు ఓ ప్రకటన చేశారు. ఆయన తాజాగా ఉద్యోన వనశాఖ పరిస్థితిపై సమీక్ష జరిపారు. ఈ భేటీలో ఈ శుభవార్త నిరుద్యోగులకు చెప్పారు.
ఇక ఇదే సమీక్షలో కన్నబాబు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కడా యూరియా కొరత లేదని స్పష్టం చేశారు. కొందరు వ్యాపారాలు కావాలనే యూరియా కొరత సృష్టిస్తున్నారని అన్నారు. ఉద్యానవన పంటలను ఈ ఏడాది మరో లక్ష ఎకరాలకు పెంచాలన్నది తమ లక్ష్యంగా చెప్పారు.
గత ఏడాది కంటే అరటి, మామిడి ఎగుమతులను కూడా పెంచే ప్రయత్నం చేస్తామని అన్నారు.మార్క్ ఫెడ్ నుంచి డీలర్లకు యూరియా సరఫరా ఆపివేశామని, అధిక ధరలకు విక్రయిస్తే వ్యాపారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. రాష్ట్రంలో యూరియా డిమాండ్ గతంలో కంటే పెరిగిందని, అవసరమైన మేరకు యూరియా తెప్పించేందుకు కేంద్రంతో మాట్లాడుతున్నట్టు చెప్పారు.