ఎంతోకాలంగా ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న వారికి 2020 సంవత్సరం శుభవార్త చెప్పనుంది. ఈ ఏడాది కంటే మిన్నగా...2020లో కొలువుల జాతర ఉండనుంది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ కొలువులు ఎక్కువగా రానున్నాయి. ఇప్పటికే ఏపీ ప్రభుత్వం 2019లో లక్షకు పైనే ఉద్యోగాల కల్పించింది. ఇక 2020లో జనవరిలోనే ఏ‌పి‌పి‌ఎస్‌సి నుంచి సరికొత్త నోటిఫికేషన్లు రానున్నాయి. పోలీసు ఉద్యోగాలతో పాటు అనేక ప్రభుత్వ ఉద్యోగాలకు ఏపీ ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.

 

2020లో చేపట్టే రిక్రూట్‌మెంట్లకు సంబంధించిన నోటిఫికేషన్ల వివరాలతో ఏపీపీఎస్సీ క్యాలెండర్‌ విడుదల చేయనుంది. వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలను ఆరు కేటగిరీలుగా ఏపీపీఎస్సీ విభజించిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోని అన్ని ఉద్యోగాలను సివిల్‌ సర్వీసెస్, మెడికల్, ఇంజినీరింగ్, టీచింగ్, జనరల్‌ సర్వీసెస్‌ గ్రూపులుగా ఈ విభజన జరిగింది. ఒక్కో పోస్టులకు ఒక్కో పరీక్ష కాకుండా.. ఒక్కో గ్రూపులోని పోస్టులకు ఇకపై ఒకే పరీక్ష నిర్వహించనున్నారు.

 

అటు ఏపీలో అదనంగా 25 స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే తిరుపతిలో స్కిల్‌డెవలప్‌మెంట్‌ యూనివర్శిటీ, విశాఖపట్నంలో హైఎండ్‌ స్కిల్స్‌ యూనివర్సిటీ ఏర్పాటుకు సిద్ధమవుతున్నారు. అటు కేంద్రం ప్రభుత్వం కూడా భారీగా నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు సిద్ధమవుతుంది. యూ‌పి‌ఎస్‌సి, ఎస్‌ఎస్‌సిల ద్వారా లక్షల ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. ఇక వీటితో పాటు 2020 సంవత్సరంలో రైల్వే శాఖ 3 లక్షలకు పైగా ఉద్యోగాల భర్తీ చేయబోతోంది. అంతే కాదు... ఇప్పటివరకు రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డ్-RRB పరీక్షల ఫలితాలు త్వరలో విడుదల కానున్నాయి. 2020 జనవరిలోనే ఫలితాలు విడుదల చేసేందుకు కసరత్తు జరుగుతోంది.

 

మొత్తం 3,00,000 పైగా పోస్టుల్లో 2,621 పోస్టులు గెజిటెడ్ ఆఫీసర్ లెవెల్ కాగా 3,03,606 పోస్టులు నాన్-గెజిటెడ్ లెవెల్ స్థాయిలో భర్తీ చేస్తారు. 2018, 2019 సంవత్సరాల్లో నిర్వహించిన పరీక్షల తుది ఫలితాలు విడుదల కానున్నాయి. ఆ పోస్టులు కూడా ఇందులో కలిపే ఉంటాయి. అలాగే 36,871 గ్రూప్ సీ పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగనుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగాలతో పాటు లక్షల్లో ప్రైవేట్ ఉద్యోగాల నియమకాలు కూడా జరగనున్నాయి. మొత్తానికైతే 2020 సంవత్సరం నిరుద్యోగులకు కలిసిరానుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: