దేశంలో కరోనా వేగంగా విజృంభిస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా పబ్లిక్ పరీక్షలు వాయిదా పడ్డాయి. తెలంగాణలో పదో తరగతి పరీక్షలు గత నెలలోనే జరగాల్సి ఉన్నా కరోనా తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పరీక్షలు వాయిదా వేసింది. రాష్ట్రంలో ఏప్రిల్ 30 వరకు లాక్ డౌన్ అమలవుతూ ఉండటంతో మే నెలలో పరీక్షలు జరిగే అవకాశం ఉంది. తాజాగా పదో తరగతి విద్యార్థుల కోసం తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. 
 
పాఠశాలలు మూసివేయడం... పరీక్షలు వాయిదా పడటం.... విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని తెలంగాణ ప్రభుత్వం వారి భవిష్యత్తు కోసం అనేక ఏర్పాట్లు చేస్తోంది. ఈరోజు నుంచి దూరదర్శన్‌ యాదగిరి ఛానల్‌లో పదో తరగతి విద్యార్థుల కోసం డిజిటల్ పాఠాలు ప్రసారం కానున్నాయి. ఈ ఛానల్ లో ప్రతిరోజు ఉదయం 10 నుంచి 11 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 5 గంటల వరకు పాఠాలు ప్రసారం అవుతాయి. 
 
రాష్ట్ర ప్రభుత్వం మ్యాథ్స్, సైన్స్ సబ్జెక్టులకు అధిక ప్రాధాన్యత ఉండేలా టైం టేబుల్ ను రూపొందించింది. డిజిటల్ పాఠాల ద్వారా ఇంట్లో ఉన్న విద్యార్థులకు ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో కరోనా తీవ్రత తగ్గితే మే నెల మూడవ వారం నుంచి పరీక్షలు మొదలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. లాక్ డౌన్ అనంతరం ప్రభుత్వం పదో తరగతి పరీక్షలపై కీలక ప్రకటన చేయనుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: