దేశంలో కరోనా మహమ్మారి వేగంగా విజృంభిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో ప్రతిరోజూ పదుల సంఖ్యలో కరోనా కేసులు నమోదవుతున్నాయి. కరోనా విజృంభణతో దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ఇంటర్ విద్యార్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు పరీక్షల ఫలితాల గురించి టెన్షన్ పడుతున్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఇంటర్ బోర్డ్ ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ ఫలితాలను లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత విడుదల చేయాలని యోచిస్తున్నట్లు తెలుస్తోంది. 
 
రాష్ట్రంలో ఏప్రిల్ నెలలోనే ఇంటర్ ఫలితాలు వెలువడాల్సి ఉన్నా కరోనా వల్ల ఫలితాలు వాయిదా పడ్డాయి. గత కొన్ని రోజులుగా బోర్డు నుంచి ఫలితాల గురించి ఎటువంటి ప్రకటన లేకపోవడంతో విద్యార్థుల తల్లిదండ్రులు బోర్డు వద్దకు చేరుకుంటున్నారు. కరోనా వల్ల ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ జవాబు పత్రాల మూల్యాంకనం ఇంకా పూర్తి కాలేదు. 
 
అందువల్ల లాక్ డౌన్ ఎత్తివేసిన వెంటనే మూల్యాంకనంకు తగిన ఏర్పాట్లు చేసి... విద్యార్థులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఇంటర్ బోర్డు ఫలితాలను ప్రకటించనుందని సమాచారం. రాష్ట్రంలో ఇంటర్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు మార్చి 4 నుంచి 21 వరకు జరిగాయి. ఇంటర్ సెకండియర్ పరీక్షలు మార్చి 5 నుంచి 23 వరకు జరిగాయి. ఇంటర్ బోర్డ్ http://bie.telangana.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఫలితాలను ప్రకటించనుంది. 
 
లాక్ డౌన్ తరువాత ఇంటర్ బోర్డ్ పరీక్ష ఫలితాల తేదీల గురించి కీలక ప్రకటన చేయనుంది. మరోవైపు దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలవుతున్న నేపథ్యంలో ప్రతి సంవత్సరం ఏప్రిల్, మే నెలలలో జరిగే ఎంసెట్, నీట్, ఐఐటీ, ఇతర పోటీ పరీక్షలు వాయిదా పడ్డాయి. లాక్ డౌన్ దేశవ్యాప్తంగా ఎత్తివేసిన తరువాత పోటీ పరీక్షలకు సంబంధించిన తేదీలు అధికారికంగా ఖరారు కానున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: