
రాబోయే 80 ఏళ్లలో తీవ్రమైన ఎండలు, వడగాలులు, వరదలతో భారతదేశం వినాశకరమైన వాతావరణ మార్పులకు లోను కావాల్సి వస్తుందని సౌదీ అరేబియాలోని కింగ్ అబ్దుల్ అజీజ్ యూనివర్సిటీ హెచ్చరిస్తోంది. ఇటీవల యూనివర్సిటీకి సంబంధించిన ఓ బృందం రాబోయే కాలంలో వివిధ దేశాల్లో వాతావరణ పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయనే దానిపై అధ్యయనాన్ని కొనసాగిస్తోంది. అయితే ఈ విషయంలో భారతదేశం ఎన్నో గడ్డు పరిస్థితులను ఎదుర్కొనుందని తెలిపింది. భారతదేశంలో నేడు భూమి, దాన్నంటి పెట్టుకున్న పర్యావరణం, జీవజాలం కాలుష్యంలో కూరుకుపోతోందని తెలిపింది.
అంతేకాక పెరిగిన భూతాపం వల్ల ఏర్పడిన విక్రుత వాతావరణ మార్పుల కారణంగా ప్రళయ విధ్వంసానికి చేరువవుతుందని హెచ్చరించింది మితిమీరిన పట్టణీకరణ, పారిశ్రామికీకరణ, కాలుష్యాలు, గ్రీన్‌హౌస్ వాయువుల వెలువరింపు, జీవజలాలు, ఉష్ణప్రాంత అడవులు క్షీణించడం, చిత్తడి నేలల వినాశనం, భూమికొరత, అడవుల విస్తరణ, ఎల్‌నినో, లానినో ప్రకృతి పరిణామాల వైపరీత్యాల మూలంగా కరువులు, వరదలు, జలవనరుల విధ్వంసం, భూగర్భజలాల అంతర్ధానం, హరిత విప్లవ ధ్వంసం, భూసారం క్షీణించడం, పునరుత్పత్తి కాని శిలాజ ఇంధనాలు, ఖనిజాలు అంతరించడం లాంటి పరిస్థితులు భారతదేశాన్ని చుట్టుముడుతాయని తెలిపింది.
వీటన్నిటిని నిరోధించి పర్యావరణాన్ని యాథాస్థితికి తీసుకురాలేకపోతే భూతల నరకంగా భారతదేశం మారుతుందని హెచ్చరించింది. ఈ మార్పుల ప్రభావం పర్యావరణం, ఆర్థిక వ్యవస్థ, ప్రజల జీవనోపాధిపై భారీగా ఉంటుందని పేర్కొంది. ప్రొఫెసర్ మన్సూర్ అల్మజ్రౌయ్ నేతృత్వంలో సూపర్ కంప్యూటర్‌ను ఉపయోగించి ఈ అధ్యయనం నిర్వహించారు. ఈ విధానం ద్వారా 21వ శతాబ్దం చివరాఖం నాటికి వార్షిక సగటు ఉష్ణోగ్రతలు 4.2 సెల్సియస్ డిగ్రీల వరకు పెరిగే ప్రమాదముందని బృందం తెలిపింది. దీని ప్రభావం ముఖ్యంగా వాయవ్య భారతదేశంపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో అక్కడి మంచు వేగంగా కరగడం, దీంతో పెద్ద ఎత్తున వరదలు సంభవించే అవకాశం ఉందని పేర్కొంది. ఫలితంగా వ్యవసాయం, పర్యావరణం, ప్రజల జీవనోపాధి దెబ్బతింటాయని సూచించింది.