చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు ఎక్కువ సమయం చదువుతున్నప్పటికీ తక్కువ మార్కులు వస్తున్నాయని చెబుతూ ఉంటారు. తమ పిల్లలకు చదువుపై ఏకాగ్రత కుదరటం లేదని చెబుతూ ఉంటారు. మరి విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నవి ఏంటి....? అనే ప్రశ్నకు నీల్సన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. ఎలక్ట్రిక్‌ వస్తువులు విద్యార్థుల ఏకాగ్రతకు భంగం కలిగిస్తున్నాయని ఈ సర్వేలో ప్రధానంగా మారింది. 
 
ముఖ్యంగా ఫ్యాన్లు పరీక్షల సమయంలో ఏకాగ్రతను దెబ్బ తీస్తున్నాయని తమ పిల్లలు ఫ్యాన్ల వల్లే సరిగ్గా చదవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫ్యాన్లతో సహా ఇతర ఎలక్ట్రిక్‌ ఉపకరణాల శబ్దాల వల్ల ప్రశాంత వాతావరణం కొరవడుతోందని ఈ సర్వేలో తేలింది. పిల్లలు ప్రశాంతంగా చదువుకోవడానికి వీలుగా ఇండ్లలో సైలెంట్‌ జోన్లను ఏర్పాటు చేయాలని ఈ సర్వేలో పాల్గొన్న తల్లిదండ్రులు చెప్పడం గమనార్హం. 
 
ముంబై, హైదరాబాద్‌, బెంగళూరు, అహ్మదాబాద్‌, చెన్నై నగరాల్లో సర్వే నిర్వహించి నీల్సన్ సంస్థ ఈ ఫలితాలను వెల్లడించింది. ఇంట్లో సైలెంట్‌ జోన్‌ను ఏర్పాటు చేయడం ద్వారా నిశ్శబ్ద వాతావరణాన్ని సృష్టించడం సాధ్యమవుతుందని 75 శాతం మంది తల్లిదండ్రులు చెబుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు ఏకాగ్రతను ప్రభావితం చేస్తున్నాయని 51 శాతం మంది తల్లిదండ్రులు బలంగా నమ్ముతున్నారు. 
 
ఫ్యాన్లు, టీవీ, మ్యూజిక్‌ సిస్టమ్స్‌, కిచెన్‌ ఉపకరణాలు పరీక్షల కాలంలో పిల్లలు కలవరపడటానికి కారణమవుతున్నయని 83 శాతం తల్లిదండ్రులు అభిప్రాయపడుతున్నారు. పిల్లలు అర్ధరాత్రి, తెల్లవారుజామున ఏకాగ్రతను కలిగి ఉన్నా సీలింగ్ ఫ్యాన్ వల్ల వారి ఏకాగ్రతకు భంగం కలుగుతోందని 47 శాతం తల్లిదండ్రులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వీలైనంత వరకు శబ్దం చేసే ఎలక్ట్రిక్ వస్తువులకు విద్యార్థులను దూరంగా ఉంటే మంచిది. ఈ విధంగా చేస్తే విద్యార్థులకు ఏకాగ్రత కుదిరి ఎక్కువ మార్కులు సాధించే అవకాశం ఉంటుంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: