దేశంలో కరోనా విజృంభిస్తున్న సంగతి అందరికి తెలిసిందే. కరోనా కారణంగా చాల మంది జీవనోపాధిని కోల్పోయిన సంగతి విదితమే. అయితే దేశంలో కరోనా కారణంగా చదువుకున్న వారి పరిస్థితి చదువుకొని వారి స్థితి ఒకేలా మారిపోయింది. ఉన్నత స్థాయి చదువులు చదివిన ఉద్యోగాలు లేక చాల మంది కూలి పనులు చేసుకుంటున్నారు. మరికొంత మంది ఉద్యోగాలు రావడం లేదన్నా మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నారు. అయితే తాజాగా ఏపీ ప్రభుత్వం నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది.
తాజాగా ఆంధ్రప్రదేశ్ వైధ్య విధాన పరిషత్-ఏపివివిపి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సమాచారం. సివిల్ అసిస్టెంట్ సర్జన్ స్పెషలిస్ట్, డెంటల్ అసిస్టెంట్ సర్జన్ పోస్టుల్ని భర్తీ చేస్తోందన్నారు. గైనకాలజీ, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసన్, అనస్థీషియా లాంటి విభాగాల్లో మొత్తం 723 ఖాళీలను ప్రకటించిందని అధికారులు వెల్లడించారు.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ జూన్ 19న ప్రారంభమైందన్నారు. దరఖాస్తుకు జూలై 18 చివరి తేదీ. ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను కమిషనరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ మిషన్ అధికారిక వెబ్‌సైట్ http://cfw.ap.nic.in/ లో తెలుసుకోవచ్చునన్నారు.
అయితే మొత్తం 723 ఖాళీలు ఉండగా అందులో గైనకాలజీ- 333, పీడియాట్రిక్స్- 38, అనస్థీషియా- 105, జనరల్ మెడిసిన్- 37, జనరల్ సర్జరీ- 29, ఆర్థోపెడిక్స్- 31, ప్యాథాలజీ- 24, ఆప్తమాలజీ- 27, రేడియాలజీ- 27, సైకియాట్రి- 7, డెర్మటాలజీ- 11, ఈఎన్‌టీ- 23, డెంటల్ అసిస్టెంట్ సర్జన్- 31 పోస్టులున్నాయని తెలిపారు.
ఈ పోస్టులకు విద్యార్హత వివరాలు చూస్తే పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ, బీడీఎస్ పాసైనవారు దరఖాస్తు చేయొచ్చునన్నారు. అభ్యర్థుల వయస్సు 2020 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు ఉండాలన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది. ఎంపికైన వారికి రూ.53,500 వేతనం లభిస్తుందని ఈ సందర్బంగా తెలియజేశారు.