ఇప్పుడు ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్‌లో ఉమ్మడి ప్రవేశ పరీక్షల (సెట్స్) నిర్వహణ తేదీలు విడుదలయ్యాయి. ఈ ప్రవేశ పరీక్షల తేదీలకు సంబంధించిన షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ శుక్రవారం ప్రకటించారు. సెప్టెంబర్ 17 నుంచి 25 వరకూ ఇంజనీరింగ్ విద్య ప్రవేశాలకై ఎంసెట్‌ను నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇక సెప్టెంబర్ 10,11 తేదీల్లో ఐసెట్, 14న ఈసెట్, 28,29,30 తేదీల్లో ఏపీపీఈసెట్, అక్టోబర్ 1న ఎడ్‌సెట్, 2వ తేదీన లాసెట్ నిర్వహించనుంది.అలాగే ఇక తెలంగాణ రాష్ట్రంలో కూడా ఈ నెల 31న ఈసెట్, వచ్చే నెల 2న పాలిసెట్, వచ్చే నెల 9, 10, 11, 14 తేదీల్లో ఇంజనీరింగ్ ఎంసెట్‌ను నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. అగ్రికల్చర్ ఎంసెట్ సహా లాసెట్, పీజీ ఈసెట్, ఎడ్‌సెట్, ఐసెట్, పీఈసెట్ తేదీలను మాత్రం పరీక్షల నిర్వహణలో సాంకేతిక సహకారం అందించే టీసీఎస్ స్లాట్స్‌ను బట్టి ఖరారు చేయనున్నట్లు సమాచారం.
ఈ ఉమ్మడి ప్రవేశ పరీక్షల నిర్వహణ నిమిత్తం రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు చాలా పకడ్బందీగా ఏర్పాట్లు చేయనున్నట్లు, పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులూ కలగకుండా తగిన రీతిలో పరీక్ష సెంటర్ల నిర్వాహకులు చర్యలు చేపట్టనున్నట్లు సమాచారం. ఈ కరోనా వైరస్ ప్రభావం కారణంగా ఇప్పటివరకూ ఇంటికే పరిమితమైన విద్యార్థులు అందరూ ఇప్పుడు రిలీజ్ అయిన ఉమ్మడి ప్రవేశ పరీక్షల షెడ్యూల్ ప్రకారం తమ ప్రిపరేషన్ను ఖచ్చితమైన టైం టేబుల్ రూపొందించుకొని మొదలు పెట్టనున్నారు. ఏది ఏమైనా ఇప్పటికీ కూడా కరోనా వైరస్ ను అంతమొందించే పూర్తి స్థాయి వ్యాక్సిన్ గానీ, మందు గానీ కనిపెట్టబడలేదనే విషయాన్ని విద్యార్థులు మర్చిపోకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటూ త్వరలో జరగనున్న పరీక్షలకు సిద్ధమవ్వాలని ఇండియా హెరాల్డ్ ఆశిస్తూ ఆల్ ది బెస్ట్ తెలుపుతుంది.