ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి సీఎం జగన్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ పాఠశాలలను బలపేతం చేసేందుకు నిర్ణయించారు. అందులో భాగంగానే ప్రభుత్వ విద్యకు పెద్దపీట వేస్తూ పలు సంక్షేమ పథకాలను అమల్లోకి తీసుకొచ్చారు.అయితే.. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో స్కూల్ అటెండెన్స్ రిజిస్టర్‌పై కీలక ఉత్తర్వులు జారీ అయ్యాయి. విద్యార్థుల అటెండెన్స్ రిజిస్టర్‌లో కుల, మత వివరాలు నమోదు చేయకూడదని స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. కొన్ని స్కూళ్లలో విద్యార్థుల కుల, మత వివరాలను రిజిష్టర్‌లో నమోదు చేస్తున్నట్టు సమాచారం రావడంతో స్పందించిన స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ వాటిని వెంటనే తొలగించాలని సర్క్యులర్ జారీ చేశారు.
విద్యార్ధుల మధ్య సామాజిక అసమానతల తొలగింపు కోసం తీసుకున్న ఈ నిర్ణయం రాష్ట్ర చరిత్రలో కీలకమైనదిగా చెప్పొచ్చు. నవంబర్ 2 నుంచి స్కూళ్లు ప్రారంభించాలని భావిస్తున్న ప్రభుత్వం ఈ నిర్ణయం తప్పనిసరిగా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ఇకపై ఏపీలోని పాఠశాల హాజరు పట్టీలో విద్యార్ధుల కులం, మతం వివరాలు కనిపించవు. ఇన్నేళ్లుగా విద్యార్ధులకు రిజర్వేషన్లు, ఇతర అవసరాల కోసం నమోదు చేసిన వీటిని ఇకపై హాజరు పట్టీ నుంచి తొలగించాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. విద్యారంగంలో తీసుకొస్తున్న మార్పుల్లో భాగంగా దీన్ని కూడా అమలు చేయాలని విద్యాశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఇదే క్రమంలో ప్రభుత్వం మరో నిర్ణయం కూడా తీసుకుంది. ఇకపై పాఠశాల విద్యార్ధుల హాజరు పట్టీలో బాలికల పేర్లను ఎర్రసిరాతో రాసే మరో విధానానికి కూడా ప్రభుత్వం మంగళం పాడింది. ఒకే పాఠశాలలో.. ఒకే తరగతి గదిలో.. ఒకే తరహాలో విద్యను అభ్యసిస్తున్న బాలికలు, బాలురను వేర్వేరుగా చూపించేలా ఉన్న ఈ విధానం కూడా తొలగించాలని పాఠాశాల విద్యాశాఖ ఆదేశాలు ఇచ్చింది.